Kerala New Cabinet : కొత్తవారితో కొలువు తీరుతున్న పినరయి విజయన్
కేరళలో వరసగా రెండో సారి అధికారాన్ని అందుకుని చరిత్ర సృష్టించిన సీఎం పినరయి విజయన్.. తన కొత్త కేబినెట్ కూర్పుతో మరో చరిత్ర లిఖిస్తున్నారు. గత కేబినెట్‌లో ఉన్న వాళ్లందర్నీ పక్కన పెట్టి.. పూర్తిగా కొత్త వాళ్లను తీసుకుంటున్నారు.

Kerala New Cabinet
Kerala New Cabinet : వ్యక్తులు ముఖ్యమా…ఫార్టీ ముఖ్యమా…అంటే ఎవరైనా నిస్సందేహంగా పార్టీ అనే చెబుతారు. కానీ భారత ప్రజాస్వామ్యం ఇప్పుడు వ్యక్తిస్వామ్యంతోనే మనుగడ సాగిస్తోంది. కాశ్మీర్ నుంచి..కన్యాకుమారి దాకా ఇదే పరిస్థితి. ఈ సంగతి పక్కనపెడితే… సాధారణంగా..ఏ రాజకీయనేతకైనా… ప్రజాదరణ, పార్టీలో పట్టు ఉంటే…వారు వ్యక్తులు కాదు… తిరుగులేని శక్తులు. వారిని పక్కనబెట్టేందుకు అధినేతలు సైతం సాహసించరు. కానీ ఇలాంటి సంస్కృతికి, వ్యక్తులకు పెద్ద పీట వేసే వ్యవహార శైలికి తెరదించాలని కేరళలోని ఎల్డీఎఫ్ కూటమి నిర్ణయించింది. యావత్ దేశం ఆశ్చర్యపోయే నిర్ణయం తీసుకుంది.
కేరళలో వరసగా రెండో సారి అధికారాన్ని అందుకుని చరిత్ర సృష్టించిన సీఎం పినరయి విజయన్.. తన కొత్త కేబినెట్ కూర్పుతో మరో చరిత్ర లిఖిస్తున్నారు. గత కేబినెట్‌లో ఉన్న వాళ్లందర్నీ పక్కన పెట్టి.. పూర్తిగా కొత్త వాళ్లను తీసుకుంటున్నారు. భారత దేశ రాజకీయాల్లోనే ఇదో కొత్త రికార్డ్. గతంలో వరుసగా గెలిచిన ముఖ్యమంత్రులెవరూ ఇంతటి సాహసం చేయలేదు. చివరకు.. కోవిడ్ కంట్రోల్‌లో కేరళలోనే కాక, దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజను కూడా పినరయ్ విజయన్ పక్కన పెట్టేయడం.. హాట్ టాపిక్‌గా మారింది.
కేరళ కేబినెట్‌లో అంతా కొత్త ముఖాలే ఉండొచ్చంటూ కొన్నాళ్లుగా ప్రచారం సాగుతున్నా.. శైలజకు మాత్రం చోటుంటుందని అంతా లెక్కలేశారు. దానికి కారణం ఆమె ట్రాక్ రికార్డే. శైలజా టీచర్ అని జనం పిలుచుకునే ఆవిడ.. కేరళలో నిఫా వైరస్ .. ఆ వెంటనే భీకర వరదలు .. ఆ తర్వాత కరోనా కల్లోలం.. అన్నింటినీ సమర్థవంతంగా డీల్ చేశారు. కేరళ ఆరోగ్య వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేశారు. కేరళలో ఈ ఐదేళ్ల కాలంలో.. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో పాటుగా…ఇంకా చెప్పాలంటే ఆయన కన్నా ఎక్కువగా శైలజ పేరు వినిపించింది. దేశంలో కరోనా తొలి కేసు కేరళలోనే నమోదయినప్పటికీ…మొదటి వేవ్‌లో కరోనా పరిస్థితి చేయిదాటక పోవడానికి శైలజా టీచర్ కృషే కారణమని యావత్ దేశం ప్రశంసించింది. అంతర్జాతీయంగానూ ఆమెకు గుర్తింపు లభించింది.
అతి సాధారణ మహిళలా వేషధారణ, సౌమ్యత, సచ్ఛీలత ఉట్టిపడే మాటలు, దేనికీ భయపడని తత్త్వం, విధి నిర్వహణలో అంకిత భావం…అన్నీ కలిసి…కెకె శైలజకు కేరళలో ప్రజాదారణ పెంచాయి. పినరయి విజయన్ వారసురాలు…ఆమేనని ప్రచారమూ జరిగింది. ఈ టీచర్ ఆరోగ్య శాఖ మంత్రిగా లేకుంటే…కేరళలో కరోనా కట్టడి సాధ్యం కాదనే విశ్లేషణలూ వినిపించాయి. బ్రిటన్‌కు చెందిన ఓ మ్యాగజైన్ శైలజను టాప్ థింకర్ ఆఫ్ ది ఇయర్ 2020గా ఎంపిక చేసింది.
జనం కూడా ఆమె పనితీరుకు ఊహించని రికార్డును కట్టబెట్టారు. ఏకంగా ఆమె పోటీ చేసిన మత్తనూర్ నియోజకవర్గం నుంచి 60 వేల భారీ మెజార్టీని కట్టబెట్టారు. కేరళ ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజార్టీ. సీఎం విజయన్‌కు కూడా ఈ స్థాయిలో ఓట్లు పడలేదు. కరోనా కల్లోలం ఇంకా కొనసాగుతుండడంతో.. మళ్లీ ఆమెకు అదే పోర్ట్‌ఫోలియోను ఇస్తారంటూ అంతా ఊహించారు. జనం కూడా అదే ఆశించారు. కానీ సీఎం పినరయి విజయన్ ఎవరూ ఊహించని సంచలన నిర్ణయం తీసుకున్నారు. కెకె శైలజ పేరు లేకుండానే కొత్త మంత్రుల జాబితా ప్రకటించి….అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
శైలజను మంత్రి వర్గంలోకి తీసుకోకపోవడానికి పినరయి విజయన్ చెప్పిన కారణం..కొత్తవారికే క్యాబినెట్‌లో చోటు కల్పించాలనుకోవడం. కేరళ సంప్రదాయానికి భిన్నంగా వరుసగా రెండుసార్లు ఎల్డీఎఫ్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన విజయన్… మంత్రివర్గాన్ని పూర్తిగా తనకు ఇష్టమైన రీతిలో ఏర్పాటుచేసుకుంటున్నారు. టికెట్ల కేటాయింపులోనూ పినరయి విజయన్ సంచలనాత్మకంగా వ్యవహరించారు. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారెవ్వరికీ …ఈ సారి టికెట్ కేటాయించలేదు.
దీనిపై పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తంచేసినప్పటికీ…ఆయన వ్యూహం మంచి ఫలితాన్నిచ్చింది. మొత్తం 140 సీట్లున్న కేరళ అసెంబ్లీలో ఎల్డీఎఫ్ 99స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 41 స్థానాలకు పరిమితమైంది. బీజేపీ ఉన్న ఒక్కస్ధానాన్ని పోగొట్టుకుని ఈ సారిఖాతా తెరవలేదు. ఈ విజయం ఇచ్చిన ధీమాతోనే…క్యాబినెట్‌లో పాత వారికి చోటు కల్పించకూడదనే సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు పినరయి విజయన్. కేబినెట్ నుంచి శైలజను తప్పించి పార్టీ విప్ బాధ్యతలను అప్పగించారు.
శైలజను పక్కన పెట్టడం ద్వారా ఓ వ్యక్తి ఇమేజ్‌కు, వారి ప్రజాదరణకు, విజయాలకు విలువ ఇవ్వబోమని సీపీఎం చెప్పినట్టయింది. ఆమె పార్టీలో ఓ భాగమని, వ్యక్తిగతంగా శైలజకు ఎలాంటి గొప్పతనం ఆపాదించేందుకుకు సీపీఎం సిద్దంగా లేదని చెబుతున్నారు. అయితే.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, కేరళలో విపరీత ప్రజాదారణ ఉన్న శైలజను చూసి పినరయి విజయన్ అభద్రతలో ఉన్నారని…విమర్శకులు అంటున్నారు. పార్టీ సిద్ధాంతాలను ఆయన పట్టించుకోవడం లేదని,పేదల మంత్రిగా గుర్తింపు పొందిన శైలజను తప్పించి…అల్లుడు మహ్మద్ రియాజ్‌కు కేబినెట్‌లో చోటు కల్పించడమే దీనికి నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు.
11 మందితో నూతన మంత్రివర్గాన్ని సీఎం పినరయి విజయన్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆయన పేర్లను ప్రకటించారు. శాసనసభ స్పీకర్‌గా ఎం.బి.రాజేశ్, మంత్రులుగా ఎం.వి.గోవిందన్, కె.రాధాకృష్ణన్, కె.ఎన్.బాలగోపాల్, పి.రాజీవ్, వి.ఎన్.వాసన్, సౌజీ చెరియన్, శివన్‌కుట్టి, మహ్మద్ రియాజ్, డాక్టర్ ఆర్.బిందు, వీణా జార్జి, వి. అబ్దుల్ రెహ్మాన్ ఉన్నారు.
కాగా తనకు మంత్రి పదవి రాకపోవటం పట్ల కెకె శైలజ స్పందించారు. తాను నిరాశకు గురికాలేదని… ప్రజలు నన్ను పార్టీని ప్రేమిస్తున్నారని.. అందుకే అధికారంలోకి వచ్చామని చెప్పుకొచ్చారు. కరోనా సమయంలో తామంతా విజయన్ నాయకత్వంలో విజయవంతంగా పని చేశామని… కొత్త మంత్రివర్గం కూడా చక్కగా పనిచేస్తుందని ఆమె తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.