కేరళను మినీ పాకిస్థాన్ అంటూ మహారాష్ట్ర మంత్రి వివాదాస్పద కామెంట్స్.. సీఎం పినరయి విజయన్ ఆగ్రహం
"విద్వేషపూరిత ప్రచారానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులు ఏకం కావాలని ప్రజాస్వామ్యవాదులందరికీ పిలుపునిస్తున్నాము" అని అన్నారు.

మహారాష్ట్ర ఫిషరీస్ మంత్రి నితీశ్ రాణే కేరళను మినీ పాకిస్థాన్‌గా అభివర్ణించడం వివాదాస్పదమైంది. మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మండిపడ్డారు.
“కేరళను మినీపాకిస్థాన్‌గా పేర్కొంటూ మహారాష్ట్ర మంత్రి నితీశ్ రాణే చేసిన అవమానకరమైన కామెంట్ చాలా హానికరమైనది. దీన్ని ఖండించాల్సిందే. ఇలాంటి వ్యాఖ్యల తీరు లౌకికవాదం, మత సామరస్యానికి పునాది అయిన కేరళకు వ్యతిరేకంగా సంఘ్ పరివార్ చేస్తున్న ద్వేషపూరిత ప్రచారాలను ప్రతిబింబిస్తుంది.
రాష్ట్రంపై జరిగిన ఈ నీచమైన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆర్‌ఎస్‌ఎస్ చేసే విద్వేషపూరిత ప్రచారానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులు ఏకం కావాలని ప్రజాస్వామ్యవాదులందరికీ పిలుపునిస్తున్నాము” అని అన్నారు.
కాగా, తాజాగా శివ ప్రతాప్ దిన్ స్మారక ప్రసంగం చేస్తూ.. కేరళలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాల ఎన్నికల విజయానికి “ఉగ్రవాదుల” మద్దతే కారణమని అన్నారు. కేరళ మినీ పాకిస్థాన్ అని అందుకే రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక అక్కడి నుంచి ఎన్నికయ్యారని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులందరూ వారికి ఓటు వేస్తారని, ఇదే నిజమని చెప్పారు.
Raja Singh: న్యూఇయర్ వేడుకల వేళ.. ప్రజలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక సూచన