మోడీ హోటళ్లకు వెళ్లరు.. ఎయిర్‌పోర్ట్‌లోనే బస చేస్తుంటారు: అమిత్ షా

గత మూడేళ్లలో ప్రధాని మోడీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.255కోట్లు అని కేంద్రమంత్రి మురళీధరన్ రాజ్యసభలో లిఖితపూర్వకంగా వెల్లడిండించడంపై లోక్ సభలో చర్చ జరిగింది. విదేశీ పర్యటనలకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారా? అంటూ ఎంపీలు ప్రశ్నించగా.. గత ప్రధానుల కంటే ప్రధాని మోడీ వీలైనంత తక్కువ ఖర్చు విదేశీ పర్యటనల కోసం ఖర్చు పెట్టారని లోక్‌సభలో తెలిపారు అమిత్ షా.
ప్రధాని మోడీ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు మధ్యలో విమానం ఏదైనా విమానాశ్రయంలో ఆగితే, విలాసవంతమైన హోటళ్లలో బస చేయకుండా.. ఎయిర్‌పోర్ట్ టెర్మినల్స్‌లోనే గడుపుతారని వివరించారు అమిత్ షా. అక్కడే స్నానం చేసి విశ్రాంతి తీసుకుంటారని వెల్లడించారు అమిత్ షా. లోక్‌సభలో ఎస్పీజీ చట్ట సవరణ బిల్లుపై మాట్లాడిన అమిత్ షా ఇదే సమయంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.
వ్యక్తిగత జీవితంలోనూ, ప్రజా జీవితంలోనూ ప్రధాని మోడీ క్రమశిక్షణతో మెలుగుతారని, మోడీ ఎప్పుడు విదేశీ పర్యటనకు వెళ్లినా తన వెంట 20శాతం కంటే తక్కువ సిబ్బందిని తీసుకెళ్తారని అమిత్ షా వెల్లడించారు. అధికారిక సమావేశాలకు హాజరైనా సరే పెద్ద సంఖ్యలో కార్లను ఉపయోగించకుండా బస్సు లేదా మరేదైనా పెద్ద వాహనంలో అక్కడికి వెళ్తున్నారని అన్నారు. గతంలో అధికారులంతా ప్రత్యేక కార్లలో అలాంటి సమావేశాలకు హాజరయ్యేవారు. మోడీ చర్యలతో చాలావరకు ఖర్చు నియంత్రణలోకి వచ్చిందని అన్నారు.