Jammu Kashmir: రాష్ట్రపతితో ప్రధాని మోదీ, అమిత్ షాల భేటీ.. గంటల వ్యవధిలో హై లెవెల్ మీటింగ్స్.. ఏం జరుగుతోంది?
సరిగ్గా ఆ తేదీకి రెండు రోజుల ముందే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.

Jammu Kashmir: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రపతి ముర్ముతో వేర్వేరుగా భేటీ అయ్యారు. గంటల వ్యవధిలో వీరు రాష్ట్రపతిని కలవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ వరుస భేటీలపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరణ కోసమేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ఆర్టికల్ 370ని రద్దు చేసి ఆరేళ్లు పూర్తవుతున్న తరుణంలో జరిగిన భేటీలతో ఈ తరహా చర్చ మొదలైంది.
బ్రిటన్, మాల్దీవుల పర్యటన తర్వాత రాష్ట్రపతిని ప్రధాని కలవడం ఇదే తొలిసారి. తర్వాత కొన్ని గంటలకు అమిత్ షా కూడా ముర్ముతో సమావేశమయ్యారు. అనంతరం జమ్మూకశ్మీర్ నేతలను కలిశారు.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే 370 ఆర్టికల్‌ను కేంద్రం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. సరిగ్గా ఆ తేదీకి రెండు రోజుల ముందే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. కచ్చితమైన గడువు నిర్దేశించనప్పటికీ.. రాష్ట్రహోదా పునరుద్ధరణకు పలుమార్లు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఇద్దరూ హామీ ఇచ్చారు.
గతంలో ఎన్నికలు కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నప్పుడు జరిగినందున, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా మంజూరు చేయడంలో కూడా కొత్త ఎన్నికలు నిర్వహించాలనే హెచ్చరిక ఉండవచ్చని పుకార్లు ఉన్నాయి. జూన్‌లో అబ్దుల్లా ఈ విషయాన్ని ప్రస్తావించారు, రాష్ట్ర హోదా పునరుద్ధరించబడిన తర్వాత అసెంబ్లీని రద్దు చేసి, కొత్త ఎన్నికలు నిర్వహిస్తే తనకు ఎటువంటి అభ్యంతరాలు లేవని అన్నారు. “రాష్ట్ర హోదా పునరుద్ధరించబడుతుందని నేను చదివాను, కానీ అసెంబ్లీ ఎన్నికలు కొత్తగా నిర్వహించాల్సి ఉంటుంది. వారిని అలా చేయనివ్వండి, వారిని ఎవరు ఆపారు” అని అబ్దుల్లా మీడియాతో అన్నారు.