సౌదీ పర్యటనకు మోడీ

భారతప్రధానమంత్రి నరేంద్రమోడీ త్వరలో సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లనున్నారు. సౌదీ అగ్రనాయకత్వంతో ద్వైపాక్షిక చర్చలు జరపునున్న మోడీ సౌదీ యువరాజు బిన్ సల్మాన్ తో సమావేశంకానున్నారు. రాజధాని రియాద్ లో గల్ఫ్ నేషన్ నిర్వహించే ఓ ఇన్వెస్ట్ మెంట్ సదస్సులో కూడా మోడీ పాల్గొననున్నట్లు సమాచారం.
అయితే సౌదీ పర్యటనకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక కన్ఫర్మేషన్ రాలేదు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం…ఇటీవల ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్ దోవల్ సౌదీలో పర్యటించిన విషయం తెలిసిందే. సౌదీ యువరాజుతో సమావేశమైన దోవల్ వివిధ అంశాలపై ఆయనతో చర్చించారు. ఆర్టికల్ 370రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సౌదీ అగ్రనాయకత్వానికి వివరించారు. సౌదీ కశ్మీర్ విషయంలో భారత్ కు మద్దతిచ్చినట్లు దోవల్ తెలిపారు.
దోవల్ సౌదీ పర్యటనలో ఉన్న సమయంలోనే మోడీ పర్యటనకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. వచ్చే నెలలో మోడీ సౌదీ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 2016లో ప్రధానిగా మొదటిసారి సౌదీకి వెళ్లిన మోడీ ఇప్పుడు రెండోసారి రియాద్ లో అడుగుపెట్టనున్నారు. తన మొదటి పర్యటన సమయంలో సౌదీ అత్యున్నత పౌర పురస్కారం అబ్దుల్ అజీజ్ సౌద్ ను మోడీ అందుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ భారత్ లో పర్యటించిన విషయం తెలిసిందే.