PM Modi: వారి నట్టింట్లోకి వెళ్లి మట్టిలో కలిపేశాం.. భారత మహిళల సిందూరాన్ని తుడిచిన ఉగ్రవాదులు మూల్యం చెల్లించుకున్నారు- ప్రధాని మోదీ
న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ కు భయపడేది లేదు. భారత్ పై కన్నేసిన ఏ ఉగ్రవాదినీ వదిలేది లేదు.

PM Modi: భారత మహిళల సిందూరాన్ని తుడిచిన ఉగ్రవాదులు మూల్యం చెల్లించుకున్నారని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాద స్థావరాలను మట్టిలో కలిపేశామన్నారు. పాకిస్తాన్ కు కూడా భారత త్రవిధ దళాలు గట్టి సమాధానం చెప్పాయన్నారు. భారత్ పై కన్నేసిన ఏ ఉగ్రవాదినీ వదిలేది లేదని ప్రధాని మోదీ మాస్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ లోని టెర్రర్ స్థావరాలన్నీ నాశనం చేశామని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ తో దేశ ఆత్మ విశ్వాసాన్ని మరింత పెంచామన్నారు ప్రధాని మోదీ.
ప్రధాని మోదీ మంగళవారం అదంపూర్ (పంజాబ్) ఎయిర్ బేస్ ను సందర్శించారు. ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో ముచ్చటించారు. సైనికుల ధైర్య సాహసాలను ఆయన మెచ్చుకున్నారు. యుద్ధం, సరిహద్దుల్లో పరిస్థితులపై సైనికులతో ప్రధాని మోదీ మాట్లాడారు. అనంతరం ఎయిర్ బేస్ లో జవాన్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
”మన సామర్థ్యం చూసి పాకిస్తాన్ కు కొన్ని రోజులు నిద్ర పట్టలేదు. పౌర విమానాలను అడ్డు పెట్టుకుని పాక్ దాడులు చేసింది. పౌర విమానాలకు ప్రమాదం లేకుండా భారత్ చేసిన దాడి గర్వకారణం. భారత్ లక్ష్మణరేఖ సుస్పష్టమైంది. కవ్విస్తే భారత్ తగిన విధంగా సమాధానం చెబుతుంది. సర్జికల్ స్ట్రైక్, ఆపరేషన్ సిందూర్ తో ఇండియా సత్తా చూపాం. న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ కు భయపడేది లేదు. ఉగ్రవాదులను, వారికి సహకరించే వారిని వేర్వేరుగా
చూడబోము. ఆపరేషన్ సిందూర్ ఇప్పుడు భారత్ కొత్త విధానం. కచ్చితత్వంతో శత్రు స్థావరాలను ధ్వంసం చేశాం. అదంపూర్ ఎయిర్ బేస్ ను ధ్వంసం చేసినట్లు పాక్ తప్పుడు ప్రచారం చేసింది” అని ప్రధాని మోదీ అన్నారు.
”ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని సైన్యం శపథం చేసింది. మళ్లీ కవ్విస్తే పాకిస్తాన్ కు దిమ్మతిరిగే సమాధానం చెబుతాం. జవాన్ల పరాక్రమంతో ఆపరేషన్ సిందూర్ నినాదం ప్రపంచమంతా మార్మోగుతోంది. ఇది నవ భారతం. మానవత్వంపై దాడి చేస్తే శత్రువును మట్టిలో కలిపేస్తాం. ఆపరేషన్ సిందూర్ లో ధైర్య సాహసాలను చూపిన సైన్యానికి సెల్యూట్. భారత సైన్యం చరిత్ర సృష్టించింది. మన సైన్యం పరాక్రమం భారత సామర్థ్యానికి ప్రతిరూపం. మన ఆయుధాలు శత్రు స్థావరాలను నాశనం చేశాయి.
భారత్ శక్తి సామర్థ్యాలను చూసినందుకు నా జీవితం ధన్యమైంది. భారత్ చూపిన ఈ పరాక్రమం త్రివిధ దళాల త్రివేణి సంగమం. ఎయిర్ ఫోర్స్ భారత దేశాన్ని గర్వించేలా చేసింది. మన సైన్యం చూపిన శక్తి సామర్థ్యాలు భావి తరాలకు గొప్ప ప్రేరణ. మన దేశ ఎయిర్ డిఫెన్స్ ముందు పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్ లు, మిస్సైళ్లు, డ్రోన్లు, యూఏవీలు ఫెయిల్ అయ్యాయి. మన సైన్యం కొట్టిన దెబ్బకు శత్రు స్థావరాలు మట్టిలో కలిసిపోయాయి.
ప్రతి భారతీయుడు సైన్యానికి మద్దతుగా నిలిచారు. మన మిస్సైల్స్ దూసుకెళ్తున్నప్పుడు శత్రువుకు భారత్ మాతాకీ జై నినాదమే వినిపించింది. భారత్ మాతాకీ జై నినాదంతో శత్రువులో వణుకు పుట్టింది. ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన సంప్రదాయం, మన విధానం. మన అక్కా చెల్లెళ్ల నుదుటి సిందూరం తుడిచిన వారి నట్టింట్లోకి వెళ్లి నాశనం చేశాం” అని ప్రధాని మోదీ అన్నారు.