Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టు అగ్రనేత హతం.. ప్రధాని మోదీ రియాక్షన్ ఇదే..

మీ అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్నా అన్నారు. మావోయిజం ముప్పును నిర్మూలించి..

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టు అగ్రనేత హతం.. ప్రధాని మోదీ రియాక్షన్ ఇదే..

Updated On : May 21, 2025 / 8:18 PM IST

Chhattisgarh Encounter: మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌ నారాయణపూర్‌ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో 27 మంది మావోయిస్టులు చనిపోయారు. మృతి చెందిన వారిలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు కూడా ఉన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌పై ప్రధాని మోదీ స్పందించారు. దీన్ని.. నక్సలిజంపై పోరాటంలో ఘన విజయంగా ఆయన అభివర్ణించారు. ఆపరేషన్‌లో పాల్గొన్న భద్రతా బలగాలను ప్రశంసించారు ప్రధాని మోదీ. మీ అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్నా అన్నారు. మావోయిజం ముప్పును నిర్మూలించి ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.

భద్రతా దళాలకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు మృతి చెందినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వెల్లడించారు. నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఇదొక మైలురాయి విజయంగా ఆయన అభివర్ణించారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించేందుకు మోదీ సర్కార్‌ దృఢ సంకల్పంతో ఉందన్నారు.

మాధ్‌ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో బీజాపూర్‌, నారాయణపూర్‌, దంతెవాడ డీఆర్జీ బలగాలు పాల్గొన్నాయి. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్ట పర్వతాల్లో 24 రోజులపాటు జరిగిన ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే.

తాజా ఎన్ కౌంటర్ లో చనిపోయిన మావోయిస్టులలో సీపీఐ-మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి, అగ్ర నాయకుడు, నక్సల్ ఉద్యమానికి వెన్నుముక అయిన నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజు ఉన్నట్లు భద్రతా దళాలు ప్రకటించాయి. నక్సలిజంపై భారత్ చేస్తున్న మూడు దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన నాయకుడిని మన దళాలు మట్టుబెట్టడం ఇదే మొదటిసారి. 1970 నుండి మావోయిస్టు ఉద్యమంలో అనుభవజ్ఞుడైన బసవరాజు దేశంలోని అత్యంత కీలక మావోయిస్టు నాయకుల్లో ఒకడు. అతని తలపై 1.5 కోట్ల రూపాయల రివార్డ్ ఉంది.

ఈ విజయం సాధించిన భద్రతా దళాలు, ఏజెన్సీలను అమిత్‌ షా అభినందించారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ మహారాష్ట్ర నుంచి 54 మంది నక్సలైట్లను అరెస్ట్ చేశామని, 84 మంది నక్సలైట్లు లొంగిపోయారని తెలిపారు. 2026 మార్చి 31లోగా నక్సలిజాన్ని నిర్మూలించాలని మోదీ ప్రభుత్వం సంకల్పించిందని ఆయన గుర్తుచేశారు.