MAN VS WILD : బియర్ గ్రిల్స్ కి హిందీ ఎలా అర్థమైందో చెప్పిన మోడీ

  • Published By: venkaiahnaidu ,Published On : August 25, 2019 / 10:51 AM IST
MAN VS WILD : బియర్ గ్రిల్స్ కి హిందీ ఎలా అర్థమైందో చెప్పిన మోడీ

Updated On : August 25, 2019 / 10:51 AM IST

డిస్కవరీ ఛానల్ లో ప్రసారమయ్యే మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో ఫేమస్ హోస్ట్ బియర్ గ్రిల్స్‌తో ప్రధాని మోడీ సాహసాలు చేసిన విషయం తెలిసిందే. ఈ షోలో పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులు, ఇతర అంశాలపై ప్రధాని మోడీకి బియర్ గ్రిల్స్‌కు చర్చ జరిగింది. అయితే ఈ షో ప్రసారమైన తర్వాత నరేంద్రమోడీ హిందీలో మాట్లాడుతుంటే బేర్ గ్రిల్స్ కి ఎలా అర్థమైందంటూ సోషల్ మీడియాలో మోడీపై పలువురు సెటైర్లు వేశారు. బేర్ గ్రిల్స్ కి మోడీ హిందీ ఎప్పుడు నేర్పించాడంటూ కామెంట్స్ చేశారు. భాష రాకున్నా ప్రధాని మోడీ హిందీలో చేసే సంభాషణతో బియర్ గ్రిల్స్ షోను ఎలా విజయవంతంగా నడిపించారనే సందేహం చాలా మంది సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేశారు.

అయితే ఇదే విషయంపై ప్రజల్లో ఉన్న సందేహాలకు సమాధానమిచ్చారు ప్రధాని మోడీ. ఇవాళ(ఆగస్టు-25,2019)మన్ కీ బాత్ లో ఈ విషయమై మోడీ మాట్లాడుతూ..టెక్నాలజీ ఆధారంగా బియర్ గ్రిల్స్‌కు నాకు మధ్య సంభాషణలు కొనసాగాయి. జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో మా సంభాషణ కొనసాగుతున్నపుడు బియర్ గ్రిల్స్ చెవికి ఓ కార్డ్‌లెస్ పరికరాన్ని పెట్టుకున్నారు. నేను హిందీలో మాట్లాడిన మాటలు ఆంగ్లంలోకి ఆటోమేటిక్‌గా ట్రాన్స్ లేట్ అవడంతో బియర్ గ్రిల్స్ నా మాటలు అర్థం చేసుకునేవారు. దీంతో షోలో మా ఇద్దరి మధ్య సంభాషణ విజయవంతంగా కొనసాగింది.

ఇంత సులువుగా షో పూర్తయేందుకు ఇపుడున్న టెక్నాలజీయే కారణమని, ఇందులో పెద్ద రహస్యమంటూ ఏమీ లేదని ప్రధాని చెప్పుకొచ్చారు. శ్రీకృష్ణుడి జీవితం నుంచి.. ప్రతిఒక్కరూ నేటి రోజుల్లో తమ సమస్యలకు పరిష్కారం కనుగొనవచ్చని మోడీ ఈ సందర్భంగా మోడీ అన్నారు.