‘మన్ కీ బాత్’ వీడియోకు యూట్యూబ్‌లో డిస్‌లైక్‌ల వెల్లువ

  • Published By: venkaiahnaidu ,Published On : August 31, 2020 / 05:11 PM IST
‘మన్ కీ బాత్’ వీడియోకు యూట్యూబ్‌లో డిస్‌లైక్‌ల వెల్లువ

Updated On : August 31, 2020 / 5:33 PM IST

ప్రతినెలా చివరి ఆదివారం భారత ప్రధాని నరేంద్రమోడీ జాతినుద్ధేశించి మన్ కీ బాత్’ ద్వారా తన మనసులో మాటలు వినిపిస్తారనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మోడీ మన్ కీ బాత్ కార్యక్రమానికి యూట్యూబ్‌లో ప్రతికూల స్పందన వస్తోంది. ‘మన్ కీ బాత్’ ఆగస్టు కార్యక్రమం డిస్‌లైక్‌ల్లో రికార్డు సృష్టించింది. బీజేపీకి చెందిన యూట్యూబ్ ఛానల్లో దీనిని పెట్టిన 24 గంటల్లోనే అత్యధికులు డిస్‌లైక్ చేసిన వీడియోల్లో ఒకటిగా నిలిచింది.

నిన్న(ఆగస్టు-30,2020) జాతిని ఉద్దేశించి మోడీ రేడియో ద్వారా ‘మన్ కీ బాత్’ వినిపించారు. ఈ కార్యక్రమంలో ఆయన ఆట బొమ్మలను మన దేశంలోనే తయారు చేసుకోవాలని, దేశీయ కుక్కలను పెంచుకోవాలని చెప్పారు. అయితే ఈ కార్యక్రమంలో జేఈఈ, నీట్ పరీక్షల గురించి మోడీ మాట్లాడకపోవడాన్ని చాలా మంది ప్రశ్నించారు.

ఆల్ ఇండియా రేడియోలో ఆదివారం వచ్చిన ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్‌తోపాటు కొన్ని ప్రైవేటు ఛానెళ్లు కూడా ప్రసారం చేశాయి. మోడీ, పీఐబీ, బీజేపీ యూట్యూబ్ ఛానెళ్లలోనూ ఈ కార్యక్రమాన్ని అప్‌లోడ్ చేశారు. అప్‌లోడ్ చేసినప్పటి నుంచే డిస్‌లైక్‌ల వెల్లువ మొదలైంది. ఇప్పటివరకు మన్ కీ బాత్‌కు వచ్చిన డిస్ లైక్‌లలో ఇవే అన్నింటి కంటే ఎక్కువ. ఇలా డిస్‌లైక్‌లు విపరీతంగా రావడం ఇదే తొలిసారి.

సోమవారం ఉదయం నాటికి మోడీ యూట్యూబ్ ఛానెల్‌లో ఈ వీడియోకు 23 వేల లైక్‌లు రాగా.. డిస్‌లైక్‌లు మాత్రం 48 వేలకు పైనే ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ యూట్యూబ్ ఛానెల్‌లోని ఈ కార్యక్రమానికి వచ్చిన డిస్‌లైక్‌లు 2.3 లక్షలకు పెరిగాయి. మొత్తం మీద ఈ వీడియోను 18 లక్షల మందికి పైగా వీక్షించగా, 74 వేల మంది లైక్ చేశారు, 5 లక్షల మంది డిస్‌లైక్ చేశారు.