PM Narendra Modi : మూడు రోజుల అమెరికా పర్యటనకు బయలు దేరిన ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు అమెరికా బయలుదేరి వెళ్లారు. ఈ నెల 22 నుంచి 25 వరకు అమెరికాలో మోదీ పర్యటన కొనసాగుతుంది.

PM Narendra Modi : మూడు రోజుల అమెరికా పర్యటనకు బయలు దేరిన ప్రధాని మోదీ

Pm Modi America Tour

Updated On : September 22, 2021 / 1:51 PM IST

PM Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు అమెరికా బయలుదేరి వెళ్లారు. ఈ నెల 22 నుంచి 25 వరకు అమెరికాలో మోదీ పర్యటన కొనసాగుతుంది. అమెరికా అధినేత జో బైడెన్ ఆహ్వానం మేరకు మోదీ ఆ దేశం లో పర్యటిస్తున్నారు. 2019 తరువాత నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. 2019 సెప్టెంబ‌ర్‌లో ఆయన అమెరికా వెళ్లారు. అప్పటి అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను క‌లిశారు. ట్రంప్‌తో కలిసి హౌడీ మోడీ ఈవెంట్‌లోనూ పాల్గొన్నారు. ఆ తరువాత మళ్లీ అమెరికా విమానం ఎక్కడం ఇదే తొలిసారి.

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ పదవి చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ ఆయన్ను కలవటం ఇదే మొదటి సారి. ఈ పర్యటనలో ఆయన అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి జో బైడెన్‌తో సమీక్షిస్తారు. వీరి భేటీలో ప్రపంచ వ్యాప్త అంశాలు, ప్రాంతీయ అంశాల గురించి చర్చించనున్నారు. పర్యటనలో భాగంగా మోదీ  యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమల హ్యారిస్‌ను కూడా కలుస్తారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో సహకారం గురించి ఆమెతో చర్చిస్తారు. యాపిల్ సీఈవో టీమ్ కుక్ తో పాటుగా అనేక అమెరికా దిగ్గజ కంపెనీల అధిపతులతో ప్రధాని సమావేశం కాబోతున్నారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా పీఎం స్కాట్ మారిసన్, జపాన్ పీఎం యొషిహిడే సుగాతో కలిసి మోదీ క్వాడ్ లీడర్ల ప్రత్యక్ష సదస్సులో పాల్గొంటారు.  మార్చిలో జరిగిన వర్చువల్ సదస్సులో చర్చించిన అంశాలు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ప్రాధాన్యతలు తదితర అంశాల గురించి ఇందులో నలుగురు దేశాధినేతలు చర్చిస్తారు. సాంకేతిక పరికరాల ఉత్పత్తి లో అగ్రగామిగా ఉన్న చైనా కు దీటుగా, సాంకేతిక అభివృద్ధి లో పరస్పర సహకారం, నాలుగు దేశాల ప్రయోజనాల పై ప్రధానంగా చర్చించనున్నారు. సాంకేతికత చౌర్యం, అక్రమ సరఫరా ను నిలువరించేందుకు, ప్రజాస్వామ్య విలువలు, పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని సాంకేతిక ను అభివృధ్ది చేసుకోవడం, పంచుకోవడం లాంటి అంశాల పై సమాలోచనలు. మైక్రో చిప్ టెక్నాలజీ ని నాలుగు దేశాలు కలిసి అభివృద్ధి చేసుకునే ప్రణాళికలు రచించుకునే అంశాల పై చర్చించే అవకాశం ఉన్నది.

ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులతో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకునే అంశాలపై విడివిడిగా సమావేశమై మోదీ వారితో చర్చిస్తారు.  సెప్టెంబర్ 25న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించడంతో  మోదీ పర్యటన ముగుస్తుంది.  కోవిడ్-19 సహా ప్రపంచవ్యాప్త సవాళ్లు, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత, వాతావరణ మార్పులు సహా మరికొన్ని ముఖ్యమైన అంశాలపై ఆయన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మాట్లాడతారు. అమెరికాతో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంలో ఈ పర్యటన దోహదపడుతుందని భావిస్తున్నానని మోదీ అన్నారు.

అలాగే జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో సంబంధాలను మరింత పెంపొందించుకునే అవకాశం కూడా కల్గుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 27 వ తేదీన ప్రధాని ఇండియాకు తిరిగి వస్తారు.  ప్రధాని మోడీతో పాటుగా అయన బృందంలో విదేశీ వ్యవహరాల మంత్రి ఎస్.జయశంకర్, విదేశీ వ్యవహరాల కార్యదర్శి హెచ్.వి. శ్రింగ్లా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో పాటు, భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.