PM Modi Convoy : ప్రధాని మోదీ మరో సంచలన నిర్ణయం.. సొంత కన్వాయ్‌లో సగం కట్..
PM Modi Convoy : ప్రధాని నరేంద్ర మోదీ తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను 50శాతానికి తగ్గించాలని నిర్ణయించారు. ఇంధన పొదుపు, అధిక ఖర్చును తగ్గించడం వంటి చర్యల్లో భాగంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
PM Modi Convoy
- ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం
- ఎస్పీజీ కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను తగ్గింపునకు చర్యలు
- కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలని నిర్ణయం
PM Modi Convoy : ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను చెప్పిన పొదుపు సూత్రాలను పాటించడం మొదలు పెట్టారు.ఇటీవల సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని దేశ ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఇంధన వినియోగాన్ని తగ్గించాలని, సొంత వాహనాలకు బదులు కార్ పూలింగ్, ప్రభుత్వ రవాణా వ్యవస్థలను ఉపయోగించుకోవాలని తద్వారా పొదుపు సూత్రాలు పాటించాలని.. అదేవిధంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని మోదీ సూచించారు. అయితే, తాజాగా.. ప్రజలకు సూచించినట్లుగానే తాను స్వయంగా పొదుపు సూత్రాలను పాటించడం మోదీ మొదలు పెట్టారు.
ప్రధాని నరేంద్ర మోదీ తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను 50శాతానికి తగ్గించాలని నిర్ణయించారు. ఇంధన పొదుపు, అధిక ఖర్చును తగ్గించడం వంటి చర్యల్లో భాగంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను తగ్గించాలని, భద్రతా ప్రమాణాలు తగ్గకుండా, అవసరమైన వాహనాలు మాత్రమే ఉండాలని పీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లాయి.
అలాగే కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలని, కానీ, కొత్త వాహనాలను కొనుగోలు చేయొద్దని పీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో భద్రతా ప్రొటోకాల్స్ కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటూనే ఎస్పీజీ ఈ ఆదేశాలను అమలు చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సహా ఇతర మంత్రులు కూడా తమ అధికారిక కాన్వాయ్ లోని వాహనాల సంఖ్యను ఇప్పటికే తగ్గించారు. రాజస్థాన్ సీఎం భజన్‌లాల్‌శర్మ తన కాన్వాయ్‌లో అదనపు వాహనాలు ఉండకూడదని సిబ్బందికి సూచించారు. మరోవైపు.. కేంద్ర మంత్రిత్వ శాఖలు కూడా ఇంధన పొదుపు చర్యలు పరిశీలిస్తున్నాయి. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ కూడా తన ఎస్కార్ట్ వాహనాన్ని వాడకూడదని నిర్ణయించారు.
