CAA నిరసనలు : పోలీసుల అదుపులో 41 మంది మైనర్లు

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలో విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి. చట్టాలను సైతం లెక్కచేయకుండా పోలీసులు ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మైనర్లను నిర్భందించి చిత్ర హింసలకు గురి చేస్తున్నారని ఆరోపణలున్నాయి. సంస్థలు జరిపిన నిజనిర్ధారణ నివేదికలో ఈ విషయాలు వెలుగు చూశాయి. జనవరి 10వ తేదీ నుంచి 24వ తేదీ మధ్య..బాధిత మైనర్లను ప్రశ్నించి..వారి వాంగ్మూలాలను సేకరించి నివేదిక రూపొందించింది. సిటిజన్ అగెనెస్ట్ హేట్, క్విల్ ఫౌండేషన్, సెంటర్ ఫర్ చైల్డ్ రైట్స్ సంస్థలు పరిశోధనలు జరిపాయి.
బిజ్నూరు, ముజఫర్ నగర్, ఫిరోజాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో పర్యటించింది సంస్థ. ఇప్పటికీ దాదాపు 41 మంది మైనర్లు పోలీసుల నిర్భందంలో ఉన్నట్లు నిర్ధారించింది. చర్యలు తీసుకొనే సమయంలో పోలీసులు ఎలాంటి సంయమనం పాటించలేదని సంస్థ వెల్లడించింది. ముజఫర్ నగర్, బిజ్నోర్ జిల్లాల్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని తెలిపింది. సదత్ మదర్సా హాస్టల్‌లోకి ప్రవేశించిన పోలీసులు 50 మంది విద్యార్థులు, ప్రిన్స్ పాల్, కుక్, ఇద్దరు సిబ్బందిని బయటకు లాగినట్లు, వీరంతా ఆందోళనల్లో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. 50 మంది విద్యార్థుల్లో 14 మంది మైనర్లు, ఇందులో నలుగురిపై ఎఫ్ఆర్ నమోదు చేశారు. ఆ నలుగురిని 12 రోజుల పాటు నిర్భందించి విడుదల చేశారని ప్రిన్స్ పాల్ అసద్ రాజా తెలిపారు.
బిజ్నోర్‌లో 22 మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మైనర్లు కూడా ఉన్నారు. రెండు రోజుల పాటు అదుపులో ఉంచారని ఓ మైనర్ తల్లి బెమినా వెల్లడించిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. నిర్భందంలో పోలీసులు చిత్ర హింసలకు గురి చేశారని, తొలుత బిజ్నోర్ పీఎస్‌కు తర్వాత..ఓ బీజేపీ ఎమ్మెల్యేకు చెందిన ఫాం హౌస్‌కు మార్చారని ఆరోపించారు. శరీరమంతా గాయాలున్నాయని, మొత్తం శరీరం నీలం రంగులో ఉందని సంస్థలకు తెలిపింది.
కనీసం పడుకోవడానికి బట్టలు కూడా ఇవ్వలేదని, ఎవరైనా నిద్ర పోతే..చిత్ర హింసలకు గురి చేసే వారని కుమారుడు తెలిపాడని వెల్లడించింది. టాయిలెట్‌కు కూడా వెళ్లకుండా అడ్డుకున్నారని, శరీరంపై లాఠీలు, బూట్ల ముద్రలు కనపడుతున్నాయన్నారు. ఫిరోజాబాద్‌లో అదుపులోకి తీసుకున్న మైనర్లకు న్యాయ సహాయం అందలేదని సంస్థలు గుర్తించాయి. లక్నోలో ఇద్దరు పిల్లలకు బుల్లెట్ గాయాలయ్యాయని తెలిపింది.
మొత్తానికి పోలీసులు హింసించారని నివేదికలు వెల్లడించాయి. వారణాసిలో ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందడం కలకలం రేపింది. డిసెంబర్ 11వ తేదీన పౌరసత్వ సవరణ చట్టం పార్లమెంట్ ఆమోదించింది. ఈ చట్టాన్ని దేశంలోని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ముస్లిం వర్గాలకు చెందిన ప్రజలు ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు. ముస్లింలను వేధించడానికి ఈ చట్టం ఉపయోగపడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా జరిగిన నిరసనల్లో 26 మంది చనిపోయారు.