గంగ, విద్య కోసం…రూ.103 కోట్లు విరాళంగా ఇచ్చిన మోడీ

  • Published By: venkaiahnaidu ,Published On : September 3, 2020 / 06:55 PM IST
గంగ, విద్య కోసం…రూ.103 కోట్లు విరాళంగా ఇచ్చిన మోడీ

Updated On : September 3, 2020 / 7:19 PM IST

ప్రజాప్రయోజన కార్యక్రమాల కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటివరకు ఇచ్చిన విరాళాలు రూ.103 కోట్లు దాటినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. తన వ్యక్తిగతంగా పొదుపు చేసిన డబ్బు, కానుకలు వేలం వేయడం ద్వారా వచ్చిన ధనాన్ని విరాళంగా ఇచ్చినట్లు వెల్లడించాయి.

పీఎం కేర్స్ ఫండ్ కు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ రూ.2.25 లక్షలను విరాళంగా ఇచ్చిన విషయం వెల్లడైంది. కరోనా మహమ్మారి, తదితర అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం ఈ నిధిని మార్చిలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రముఖులతో పాటు సామాన్యుల నుంచి పెద్ద సంఖ్యలో విరాళాలు వచ్చాయి. పీఎం కేర్‌ ఫండ్‌పై గురువారం ఆడిట్‌ నిర్వహించగా, వివరాలు వెల్లడించారు. ఆడిట్‌లో ప్రధాని మోదీ రూ.2.25లక్షలు పీఎం కేర్‌కు విరాళంగా అందించినట్లు తెలిసింది.

మోడీ… ఇంతకు ముందు బాలిక విద్య, క్లీన్‌ గంగా మిషన్‌, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారి సంక్షేమానికి విరాళాలు అందించారు. 2019లో కుంభమేళా పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమ నిధి కోసం మోడీ … రూ. 21 లక్షలు విరాళం ఇచ్చారు. అదే ఏడాది దక్షిణ కొరియాలో అందుకున్న సియోల్‌ శాంతి బహుమతి ద్వారా తనకు లభించిన మొత్తం నగదు బహుమతి కోటీ 30 లక్షలు రూపాయలు.. నమామి గంగా ప్రాజెక్టు కోసం అందించారు. ఇటీవల మోడీ … తనకు వచ్చిన మెమెంటోలను వేలం వేయగా రూ.3.40 కోట్లు వచ్చాయి. వాటిని సైతం నమామి గంగే మిషన్‌కు విరాళంగా ఇచ్చారు.

గతంలో కూడా 2015 వరకు తనకు అందిన బహుమతులను ప్రధాని వేలం వేయగా.. సూరత్‌లో జరిగిన వేలం పాటలో సుమారు రూ.8.35 కోట్లు సమకూరాయి. వాటిని సైతం గంగా నది ప్రక్షాళనకు కేటాయించారు.

దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం కోసం 2014లో గుజరాత్​ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన మోడీ … ఆ రాష్ట్ర​ ప్రభుత్వ ఉద్యోగి కుమార్తె విద్య కోసం వ్యక్తిగత పొదుపు నుంచి రూ.21 లక్షలు విరాళంగా ఇచ్చారు. అలాగే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వచ్చిన బహుమతులను సైతం వేలం వేయడం ద్వారా వచ్చిన రూ.89.96 కోట్లు ,బాలికా విద్య పథకానికి విరాళంగా ఇచ్చారు.