డబ్బులు ఉన్నాయా.. చూసుకోండి.. బ్యాంకులు సమ్మె

  • Published By: chvmurthy ,Published On : October 22, 2019 / 01:39 AM IST
డబ్బులు ఉన్నాయా.. చూసుకోండి.. బ్యాంకులు సమ్మె

Updated On : October 22, 2019 / 1:39 AM IST

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బ్యాంకుల విలీన ప్రక్రియనువ్యతిరేకిస్తూ కొన్ని బ్యాంకు యూనియన్లు మంగళవారం  అక్టోబరు 22న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో ఈరోజు బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడనుంది. అయితే బ్యాంక్‌ ఆఫీసర్లు, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌లు, ఈ సమ్మెలో పాల్గొనడం లేదు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు, సహకార బ్యాంక్‌లు కూడా ఈ సమ్మెలో పాల్గొనడం లేదు. బ్యాంక్‌ల విలీనం వీటిపై ఎలాంటి ప్రభావం చూపనందున ఇవి ఈ సమ్మెలో పాల్గొనడం లేదు.  

సమ్మెకు కారణాలు:
బ్యాంక్‌ల విలీనాలు, డిపాజిట్ల రేట్ల తగ్గింపు, ఉద్యోగ భద్రతకు సంబంధించిన కొన్ని అంశాలపై నిరసన తెలియజేస్తూ ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌(ఏఐబీఈఏ), బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(బీఈఎఫ్‌ఐ)లు బ్యాంక్‌ యూనియన్లు జాతీయ స్థాయిలో 24 గంటల సమ్మె చేపట్టాయి.

కొన్ని బ్యాంక్‌ ఉద్యోగాలను అవుట్‌ సోర్సింగ్‌కు ఇవ్వడం, బ్యాంకింగ్‌ రంగాన్ని ప్రైవేటీకరించడాన్ని ఈ యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయి. తగిన స్థాయిల్లో బ్యాంక్‌ క్లర్క్‌లను నియమించాలని, భారీగా పేరుకుపోతున్న మొండి బకాయిల రికవరీకి గట్టి చర్యలను తీసుకోవాలని యూనియన్లు  డిమాండ్‌ చేస్తున్నాయి.  

సమ్మె ప్రభావం తక్కువే:
పలు బ్యాంకులు ఇప్పటికే తమ ఖాతాదారులను అప్రమత్తం చేశాయి. సమ్మెకు పిలుపునిచ్చిన బ్యాంక్‌ సంఘాల్లో తమ ఉద్యోగుల సభ్యత్వం తక్కువగా ఉందని, ఈ సమ్మె ప్రభావం బ్యాంక్‌ కార్యకలాపాలపై స్వల్పంగానే ఉంటుందని ఎస్‌బీఐ  తెలిపింది.

సమ్మె కారణంగా ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు సిండికేట్‌ బ్యాంక్‌ వెల్లడించింది. అయితే సమ్మె జరిగితే, కార్యకలాపాలపై ప్రభావం ఉండగలదని వివరించింది. గత నెలలో 26, 27 తేదీల్లో బ్యాంక్‌ల సమ్మెకు ఆఫీసర్ల యూనియన్లు పిలుపునిచ్చాయి. కానీ, ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ఆ యూనియన్లు సమ్మెను విరమించాయి.