IPL 2019 : సాయుధ బలగాలకు BCCI రూ. 20 కోట్ల విరాళం

దేశం కోసం ప్రాణాలర్పిస్తున్న సాయుధ బలగాలకు బీసీసీఐ భారీ విరాళం ప్రకటించింది. రూ. 20 కోట్ల విరాళం అందచేసేందుకు సిద్ధమైంది. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భారత సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. దాడి ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. వీరజవాన్ల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించింది. చాలా మంది ఆర్థిక సహాయం ప్రకటించారు. దీనిపై ఇప్పటికే క్రికెటర్లు స్పందించారు కూడా. ఆర్మీ క్యాప్‌లతో బరిలో దిగి తమ మ్యాచ్ పారితోషకాన్ని (రూ. కోటికి పైగా) ఆర్మీ నిధికి పంపారు.
ఐపీఎల్ మ్యాచ్‌లు త్వరలో షురూ కానున్నాయి. సైనికుల మరణంతో ప్రారంభోత్సవ వేడుకలను బీసీసీఐ రద్దు చేసింది. అదే రోజు రూ. 20 కోట్లను త్రివిద దళాధిపతులకు BCCI అధికారులు అందచేయనున్నారు. విరాళం అందచేసే విషయంలో బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా..సీఓఏ ముందు ప్రతిపాదన తెచ్చారు. రూ. 5 కోట్ల సాయం అందించాలని కోరారు. దీనిని రూ. 20 కోట్లకు పెంచారు. ఇది చిరుసాయమేనని ఖన్నా ఈ సందర్భంగా వెల్లడించారు.