Rajat Kumar : అయ్యో పాపం.. చావుతో పోరాడుతున్న రిషబ్ పంత్ ప్రాణాలను కాపాడిన యువకుడు.. అసలేం జరిగిందంటే..
రజత్ కుమార్ 2022 డిసెంబర్ లో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. దేశవ్యాప్తంగా అతడి పేరు మార్మోగిపోయింది.

Rajat Kumar : రజత్ కుమార్.. ఈ 25ఏళ్ల యువకుడి పేరు కొన్ని రోజుల క్రితం దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయగాలతో పడి ఉన్న క్రికెటర్ రిషబ్ పంత్ ను కాపాడింది ఇతడే. 2022లో రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలతో రోడ్డు మీద పడున్న పంత్ ను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి అతడి ప్రాణాలు కాపాడింది ఈ రజత్ కుమారే. అయితే, రజత్ కుమార్ విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి అతడు విషం తాగేశాడు.
ప్రియురాలితో కలిసి విషం తాగేశాడు..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ జిల్లా బుచ్చ బస్తీ గ్రామంలో ఫిబ్రవరి 9న ఈ ఘటన జరిగింది. రజత్ కుమార్ ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆమె పేరు మను కశ్యప్(21). ఇద్దరూ లవ్ లో ఉన్నారు. అయితే వీరి ప్రేమను వారి పెద్దలు అంగీకరించలేదు. దీంతో మనస్తాపం చెంది ఇద్దరూ ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా విషం తాగేశారు. ఈ ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అమ్మాయి మను కశ్యప్ చనిపోయింది. రజత్ కుమార్ పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలో చావుతో పోరాడుతున్నాడు.
Also Read : ఛాంపియన్స్ ట్రోఫీ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. ఆందోళనలో టీమ్ఇండియా ఫ్యాన్స్.. అతి విశ్వాసమా!
కులాలు వేరు కావడంతో ప్రేమను ఒప్పుకోని పెద్దలు..
వీరి కులాలు వేరు కావడంతో వారి పెద్దలు వీరి ప్రేమను అంగీకరించలేదు. అంతేకాదు.. ఇద్దరి ఇళ్లలోనూ ఇప్పటికే పెళ్లి సంబంధాలు చూసేశారు. తమ ప్రేమను పెద్దలు నిరాకరించడంతో వారు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. కలిసి ఎలాగూ బతకలేము, కనీసం కలిసి చనిపోదామని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ విషం తాగారు.
అమ్మాయి మృతితో ఆమె ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. అయితే, రజత్ కుమార్ తన కూతురిని కిడ్నాప్ చేసి విషం ఇచ్చి చంపేశాడని మృతురాలి తల్లి సంచలన ఆరోపణలు చేసింది.
రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ ప్రాణాలను కాపాడాడు..
రజత్ కుమార్ 2022 డిసెంబర్ లో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. దేశవ్యాప్తంగా అతడి పేరు మార్మోగిపోయింది. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న క్రికెటర్ రిషబ్ పంత్ ను మరో వ్యక్తి నిషు కుమార్ సాయంతో కాపాడింది రజత్ కుమారే. తన మెర్సిడెస్ లో ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తుండగా రూర్కీ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు రిషబ్ పంత్. డివైడర్ ను ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది.
ప్రమాద స్థలానికి దగ్గరలోనే ఓ ఫ్యాక్టరీ ఉంది. అందులో పని చేస్తున్న ఇద్దరు యువకులు యాక్సిడెంట్ ను చూశారు. కాలిపోతున్న వాహనం నుంచి పంత్ ను బయటకు లాగేశారు. వెంటనే అత్యవసర వైద్య చికిత్స కోసం ఏర్పాట్లు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే వారిద్దరూ మెరుపు వేగంతో స్పందించడం పట్ల ప్రశంసలు వెల్లువెత్తాయి. వారిద్దరూ చేసిన సాహసాన్ని మెచ్చుకుంటూ పంత్ వారికి స్కూటర్లు కొనిచ్చాడు.