Champions Trophy 2025 : ఛాంపియన్స్ ట్రోఫీ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. ఆందోళనలో టీమ్ఇండియా ఫ్యాన్స్.. అతి విశ్వాసమా!
వార్మప్ మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది.

ICC announce Champions Trophy 2025 warm up matches schedule
ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఛాంపియన్స్ ట్రోఫీ పైనే పడింది. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీ హైబ్రిడ్ మోడ్‌లో జరగనుంది. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్ లో పర్యటించలేమని బీసీసీఐ తేల్చి చెప్పడంతో భారత్ ఆడే మ్యాచ్‌లను దుబాయ్ వేదికగా జరగనున్నాయి.
భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది.
ఇదిలా ఉంటే.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు వార్మప్ మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు వార్మప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. పాకిస్తాన్, ఆఫ్గానిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లు వార్మప్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. అయితే.. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు వార్మప్ మ్యాచ్‌లను ఆడడం లేదు.
దీంతో భారత జట్టు అభిమానుల్లో ఆందోళన నెలకొంది. మెగాటోర్నీ ముందు వార్మప్ మ్యాచ్‌లు ఆడితే.. అక్కడి పరిస్థితులకు అలవాటు పడతారని, మ్యాచ్‌లు ఆడకపోతే మన టీమ్‌కే ఎక్కువ నష్టం అని కామెంట్లు పెడుతున్నారు.
వామప్ మ్యాచ్ వద్దని బీసీసీఐ చెప్పి నట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల పై హెవీ వర్క్‌లోడ్ పడుతుండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 12నే ఇంగ్లాండ్ జట్టుతో భారత్ మూడో వన్డే ఆడింది. 15న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం యూఏఈ బయలుదేరనుంది. ఆ తరువాత నాలుగు రోజుల వ్యవధిలోనే భారత్ తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. కాబట్టి మధ్యలో వార్మప్ మ్యాచ్ ఆడితే ఆటగాళ్లు అలసిపోయే అవకాశం ఉందని బీసీసీఐ భావించిందట. ఈ నేపథ్యంలో వార్మప్ మ్యాచ్‌లు వద్దని చెప్పిందట.
వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే..
వార్మప్ మ్యాచ్‌ల కోసం పాకిస్తాన్ మూడు టీమ్‌లను ప్రకటించింది. ఫిబ్రవరి 14న అఫ్గానిస్థాన్‌తో షాదాబ్ ఖాన్ నేతృత్వంలోనే పాకిస్తాన్ షహీన్స్ తలపడనుంది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. ఫిబ్రవరి 16న న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ జట్లు తలపడతాయి. కరాచీలోని నేషనల్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక ఫిబ్రవరి 17న కరాచీలో దక్షిణాఫ్రికాతో ముహమ్మద్ హురైరా నేతృత్వంలోని పాకిస్తాన్ షాహీన్స్ తలపడనుంది. అదే రోజు దుబాయ్‌లో మొహమ్మద్ హరీస్ సారథ్యంలోని పాకిస్తాన్ షాహీన్స్ న్యూజిలాండ్‌ను ఎదుర్కొంటుంది.