Karnataka : కరోనా వ్యాక్సిన్ తీసుకోనివారికి రేషన్, పెన్షన్ కట్
కరోనా కట్టడికి కర్నాటక ప్రభుత్వం ముమ్మర చర్యలు తీసుకుంటోంది. వైరస్ నియంత్రణకు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత ముమ్మరంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Karnataka
corona vaccine : కరోనా కట్టడికి కర్నాటక ప్రభుత్వం ముమ్మర చర్యలు తీసుకుంటోంది. వైరస్ నియంత్రణకు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత ముమ్మరంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా చామరాజ్‌నగర్ జిల్లా యంత్రాంగం కరోనాను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి చేసింది. వ్యాక్సిన్ వేయించుకోకుంటే రేషన్, పెన్షన్ కట్ చేస్తామని ప్రకటించింది.
వ్యాక్సిన్ తీసుకోని వారికి రేషన్, పెన్షన్ కట్ చేస్తామని చామరాజనగర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఎంఆర్ రవి బుధవారం వెల్లడించారు. రేషన్ తీసుకోవాలంటే బీపీఎల్ దిగువన ఉన్న కుటుంబాలతో పాటు అంత్యోదయ కార్డుదారులు విధిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా వ్యాక్సిన్ తీసుకోని వారికి పింఛన్ రాదని కూడా తాము ప్రచారం చేస్తున్నామని తెలిపారు.
జిల్లాలోని 2.20 లక్షల పించనుదారులకు వ్యాక్సిన్ తీసుకుంటేనే పించన్ ఇవ్వాలని బ్యాంకులకు సూచనలు చేశామని వెల్లడించారు. జిల్లాలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకే తాము ఈ చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. అయితే అధికారుల చర్యలు వివాదాస్పదమవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారికి పించన్, రేషన్ నిరాకరించే అధికారం జిల్లా అధికారులకు ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.