Rekha gupta: ఢిల్లీ సీఎంగా రేఖాగుప్తా ప్రమాణం.. కొత్త మంత్రివర్గం ఇదే.. ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరు

దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా ప్రమాణ స్వీకారం చేశారు.

Rekha gupta: ఢిల్లీ సీఎంగా రేఖాగుప్తా ప్రమాణం.. కొత్త మంత్రివర్గం ఇదే.. ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరు

Rekha Gupta Oath Ceremony

Updated On : February 20, 2025 / 1:42 PM IST

Rekha gupta: దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రామ్ లీలా మైదానంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. రేఖా గుప్తాతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు పర్వేశ్ వర్మ, ఆశీశ్ సూద్, మజీందర్ సింగ్ సిర్సా, రవీందర్ ఇంద్రజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Also Read: Rekha Gupta: ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. ఎవరు ఆమె? అంతటి స్థాయికి ఎలా వచ్చారంటే?

రేఖాగుప్తా ప్రమాణ స్వీకారం కోసం ఇంటి నుంచి బయలుదేరే ముందు హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఆమె రామ్ లీలా మైదానానికి చేరుకొని, నేతలను పలుకరించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ పాటు అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఏపీ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సాధువులు, వివిధ రంగాల ప్రముఖులు కూడా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

27ఏళ్ల తరువాత ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేఫథ్యంలో బీజేపీ కార్యకర్తలు, నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 నియోజకవర్గాలకుగాను బీజేపీ అభ్యర్థులు 48 నియోజకవర్గాల్లో విజయం సాధించారు. ఆమ్ ఆద్మీ పార్టీ  22 సీట్లనును గెలుచుకుంది.

బీజేపీ నుంచి సుష్మాస్వరాజ్, ఉమాభారతి, వసుందర రాజే, ఆనందీబెన్ పటేల్ ల తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఐదో మహిళగా, దేశంలో విభిన్న పార్టీల నుంచి సీఎం పదవిని చేపట్టిన 18వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా నిలిచారు.

 

రేఖా గుప్తా ఎవరు?
♦ రేఖాగుప్తా హరియాణాలోని జులానాలో 19 జులై 1974లో జన్మించారు.
♦ 1976లో ఆమె తండ్రికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ ఉద్యోగం వచ్చింది. దీంతో వారి కుటుంబం మొత్తం ఢిల్లీకి మకాం మార్చారు.
♦ ఢిల్లీ యూనివర్శిటీ పరిధిలోని దౌలత్ రామ్ కళాశాలలో బీకాం చదివారు.
♦ యూనివర్శిటీలో చదివే సమయంలో 1992లో ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు.
♦ 1995-96లో ఢిల్లీ వర్శిటీ విద్యార్థి సంఘం కార్యదర్శిగా పనిచేశారు. 1996-97లో అధ్యక్షురాలిగా సేవలందించారు.
♦ 1998లో మనీశ్ గుప్తాను వివాహం చేసుకున్నారు.
♦ 2007లో ఉత్తర పీతంపుర మున్సిపల్ కౌన్సిలర్ గా విజయం సాధించారు. దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.
♦ సంఘ్ మహిళా సంబంధిత కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొనేవారు.
♦ ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు.
♦ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ స్థానం నుంచి రేఖాగుప్తా విజయం సాధించారు.