ఆపరేషన్ ఉత్తరాఖండ్ లో మరో అవాంతరం..సహాయక చర్యలు నిలిపివేత

ఆపరేషన్ ఉత్తరాఖండ్ లో మరో అవాంతరం..సహాయక చర్యలు నిలిపివేత

Updated On : February 11, 2021 / 3:14 PM IST

Rescue operation  ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆదివారం సంభవించిన ధౌళిగంగ జలప్రళయం తర్వాత కొనసాగుతున్న సహాయక చర్యలకు అడుగడుగునా ఆటంకం ఎదురవుతుంది.రిషిగంగా నదిలో నీటిమట్టం పెరగడంతో సహాయక చర్యలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్​ తెలిపారు. వరదలో గల్లంతై.. తపోవన్​ సొరంగంలో చిక్కుకున్నట్లు భావిస్తున్న వారిని రక్షించేందుకు ఈ ఉదయం చేపట్టిన డ్రిల్లింగ్ ఆపరేషన్​ కూడా అర్ధాంతరంగా నిలిచిపోయింది. తవ్వకాలు జరిపే యంత్రం​ చెడిపోవడంతో ఆపరేషన్ తాత్కాలికంగా నిలిచిపోయింది.

బుధవారం నాటికి తపోవన్ విద్యుత్​ కేంద్రం వద్ద ఉన్న రెండో సొరంగంలో 120 మీటర్ల వరకు శిథిలాలను తొలగించినట్లు తెలుస్తోంది. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర గవర్నర్ బేబీ రాణి మౌర్య పర్యటించారు.ఐటీబీపీ అధికారులతో సహాయక చర్యలపై చర్చించారు.

మరోవైపు, ఉత్తరాఖండ్ జలవిలయానికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. వరద ఉద్ధృతికి ముందు.. తర్వాత గల తేడాలను ఈ చిత్రాల ద్వారా ఇస్రో తెలిపింది. ఈ చిత్రాలను కార్టొశాట్​-3 శాటిలైట్ తీసింది. వరదల వల్ల రిషీ గంగా, ధౌళి గంగా నదీ పరివాహక ప్రాంతాల్లోని డ్యాంలు పూర్తిగా ధ్వంసమైనట్లు ఈ చిత్రాల్లో తెలుస్తుంది. వరద ధాటికి ధౌళి గంగా ప్రాంతంలో భారీ ఎత్తున శిథిలాలు పోగయ్యాయని చిత్రాలు వివరిస్తున్నాయి. చమోలీ తదితర ప్రాంతాల్లో సహాయక చర్యలు జోరుగా సాగుతున్న వేళ ఇస్రో ఈ చిత్రాలను ప్రభుత్వ అధికారులకు అందించింది. ఈ ఘటనకు గల కారణాలను డీఆర్​డీఓ, ఇస్రో శాస్త్రవేత్తలు కలిసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉత్తరాఖండ్‌లో ఆదివారం జల విలయం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.. జోషిమఠ్‌ వద్ద నందాదేవీ హిమానీనదం కట్టలు తెంచుకోవడం వల్ల చమోలీ జిల్లా రేనీ తపోవన్‌ వద్ద రిషి గంగా నదికి ఆకస్మిక వరదలు సంభవించాయి. రెండు జల విద్యుత్​ ప్రాజెక్టులు ధ్వంసమయ్యాయి. జలవిలయం కారణంగా ఇప్పటి వరకు 35మంది మరణించగా..204 మంది గల్లంతయ్యారని ఆ రాష్ట్రప్రభుత్వం వెల్లడించింది. గల్లంతైనవారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. భారీ యంత్రాలతో బురదమేటలను తొలగిస్తున్నారు.