జూపార్కులో రాయల్ బెంగాల్ టైగర్ మృతి

ఢిల్లీ జూపార్కులో రాయల్ బెంగాల్ టైగర్ రమా శుక్రవారం (సెప్టెంబర్ 20)న చనిపోయింది. రెండు నెలలుగా రమా అనారోగ్యంతో బాధపడుతోందని.. డాక్టర్లు చికిత్స చేసినా ఫలితం లేదని వెల్లడించారు క్యూరేటర్. టైగర్ రమా వయసు ఎనిమిదిన్నర సంవత్సరాలు. రాయల్ బెంగాల్ టైగర్ జీవిత కాలం 15 సంవత్సరాలుగా ఉంటుంది. అనారోగ్యం వల్ల తొమ్మిది సంవత్సరాలకే చనిపోయిందని వెల్లడించారు వైద్యులు. ఐదుగురు పశు వైద్యుల బృందం పోస్ట్ మార్టం నిర్వహించింది. కాలేయం, కిడ్నీలు పాడయ్యాయని రిపోర్ట్ చెబుతోంది. జంతు హక్కుల కార్యకర్తలు మాత్రం రమాది హత్య అని ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
టైగర్ రమా 2011లో మైసూర్ జూలో పుట్టింది. 2014లో ఢిల్లీ జూకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి రమా జూ సందర్శకుల్ని ఎంతగానే అలరించింది. 2019, జూలై 29న టైగర్ రమా అనారోగ్యానికి గురైంది. అప్పటి నుంచి వెటర్నరీ డాక్టర్లు చికిత్స అందిస్తూనే ఉన్నారు. అప్పటి నుంచి మాంసాహారం తినటంలేదు. కేవలం ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకుంటుంది.
అనారోగ్యం ఉన్న బెంగాల్ టైగర్ రమాపై సెప్టెంబర్ 10న జూ కీపర్ ఇనుపరాడ్లతో దాడి చేశాడని.. ఆ తర్వాత దాని ఆరోగ్యం క్షీణించి చనిపోయిందని జంతు హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. చికిత్స జరుగుతున్న సమయంలోనూ చూడటానికి జంతు హక్కుల కార్యకర్తలను అనుమతించలేదని డోగ్రా అనే జంతు హక్కుల కార్యకర్త ఆరోపిస్తున్నారు. గతంలో కూడా రీటా అనే చింపాంజీని హింసించారనీ.. అందుకే అది చనిపోయిందని చెబుతున్నారు. నోరు లేని జంతువులపై జూ అధికారులు నిర్లక్ష్యంతో హింసలు జరుగుతున్నాయనీ.. వీటిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.