కర్నాటక కాంగ్రెస్ నాయకుల ఇళ్లు,కార్యాలయాల్లో ఐటీ సోదాలు..5కోట్లు సీజ్

  • Published By: venkaiahnaidu ,Published On : October 11, 2019 / 10:55 AM IST
కర్నాటక కాంగ్రెస్ నాయకుల ఇళ్లు,కార్యాలయాల్లో ఐటీ సోదాలు..5కోట్లు సీజ్

Updated On : October 11, 2019 / 10:55 AM IST

క‌ర్నాట‌క‌ మాజీ డిప్యూటీ సీఎం,సీనియర్ కాంగ్రెస్ లీడర్ జీ ప‌ర‌మేశ్వ‌ర‌తో పాటు ఇత‌రుల నివాసాల్లో గురువారం ఐటీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. మాజీ ఎంపీ ఆర్‌ఎల్‌ జాలప్ప కొడుకు రాజేంద్ర ఇండ్లపై ఆదాయంపన్ను అధికారులు గురువారం దాడులు జరిపారు. బెంగుళూరుతో పాటు తుమ‌కూరులోని ప‌లు ప్రాంతాల్లో ఐటీ సోదాలు చేసింది. అయితే వివిధ ప్రాంతాల్లో జ‌రిపిన సోదాల్లో సుమారు 5 కోట్ల న‌గ‌దు దొరికిన‌ట్లు శుక్రవారం(అక్టోబర్-11,2019) ఐటీ అధికారులు తెలిపారు. ఇవాళ కూడా మ‌రో 25 ప్రాంతాల్లో ఐటీ ఆఫీస‌ర్లు త‌నిఖీలు చేస్తున్నారు.

పరమేశ్వర కుటుంబం సిద్ధార్థ గ్రూప్‌ విద్యా సంస్థలను నిర్వహిస్తున్నది. ఈ సంస్థలను పరమేశ్వర తండ్రి హెచ్‌ఎం గంగాధరయ్య 58 ఏండ్ల క్రితం స్థాపించారు. పరమేశ్వర ఇంటితోపాటు విద్యా సంస్థల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పరమేశ్వర సోదరుడు శివప్రసాద్‌, వ్యక్తిగత సహాయకుడు రమేశ్‌ ఇండ్లపై కూడాదాడులు జరిగినట్టు అధికారులు తెలిపారు. కోలార్‌ జిల్లా దొడ్డబల్లపురలో ఆర్‌ఎల్‌ జాలప్ప ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీని రాజేంద్ర నిర్వహిస్తున్నారు. నీట్‌ పరీక్ష విషయమై, కోట్లాది రూపాయల పన్ను ఎగవేత ఆరోపణలపై ఈ దాడులు జరిగినట్టు తెలుస్తున్నది. దాదాపు 300 మంది ఐటీ సిబ్బంది ఇద్దరు నేతలకు సంబంధించిన 30 ప్రాంతాలలో దాడులు చేసినట్టు అధికారులు చెప్పారు.

తుమకూరులోని శ్రీ సిద్ధార్థ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలోని రెండు మెడికల్‌ కాలేజీల్లో నిర్వహించిన నీట్‌ పరీక్షల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. అభ్యర్థులకు బదులుగా వేరొకరు పరీక్షలు రాసినట్టు, ఈ క్రమంలో లక్షల రూపాయలు చేతులు మారినట్టు ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే ఐటీ అధికారులు దాడులు నిర్వహించినట్టు ఐటీ అధికారులు తెలిపారు.