Putin India Visit: భారత్ చేరుకున్న రష్యా అధ్యక్షుడు.. పుతిన్‌కు ఘన స్వాగతం పలికిన ప్రధాని మోదీ

పర్యటనలో భాగంగా భారత్ తో పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు.

Putin India Visit: భారత్ చేరుకున్న రష్యా అధ్యక్షుడు.. పుతిన్‌కు ఘన స్వాగతం పలికిన ప్రధాని మోదీ

Updated On : December 4, 2025 / 8:01 PM IST

Putin India Visit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ చేరుకున్నారు. ఢిల్లీలోని పాలం ఎయిర్ పోర్టులో పుతిన్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. భారత్-రష్యా 23వ వార్షిక సదస్సు కోసం పుతిన్ వచ్చారు. 2 రోజుల పాటు ఉండనున్నారు. నాలుగేళ్ల తర్వాత పుతిన్ ఇండియాకు వచ్చారు. పర్యటనలో భాగంగా భారత్ తో పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. ఇరు దేశాల మధ్య మరింత మెరుగైన సంబంధాలు నెలకొల్పేందుకు పుతిన్ టూర్ దోహదపడనుంది. ప్రధాని మోదీ ఇచ్చే ప్రైవేట్ విందుకు పుతిన్ హాజరు కానున్నారు.

పుతిన్ రాక సందర్భంగా ఇప్పటికే రష్యా సెక్యూరిటీ భారత్ చేరుకుంది. భారత్ కూడా ఎన్ఎస్‌జీని రంగంలోకి దించింది. ఐదు అంచెల పటిష్ఠ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా పేరుగాంచిన హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు చెందిన హైదరాబాద్ హౌస్‌లో పుతిన్ బస చేయనున్నారు. 1 అశోక్ రోడ్‌లో ఉన్న ఈ చారిత్రక భవనాన్ని.. ప్రస్తుతం ప్రధానమంత్రి స్టేట్ గెస్ట్ హౌస్‌గా ఉపయోగిస్తున్నారు. ప్రపంచ నాయకులకు ఆతిథ్యం ఇస్తూ భారత్‌కు గర్వకారణంగా నిలుస్తోంది హైదరాబాద్ హౌస్.

ఇక విదేశీ పర్యటనల్లో పుతిన్‌ చుట్టూ కఠినమైన భద్రతా ప్రొటోకాల్‌ ఉంటుంది. పుతిన్‌ తీసుకునే ఆహారంలో విష పదార్థాలేమైనా కలిశాయా అని గుర్తించేందుకు విదేశాల్లో ఆయన వెంట వ్యక్తిగత ప్రయోగశాల ఎప్పుడూ ఉంటుంది. విదేశాల్లో హోటల్‌ స్టాఫ్‌ సేవలను ఆయన వాడుకోరు. ఆయన కోసం రష్యా నుంచే చెఫ్‌లు, హౌస్‌ కీపింగ్‌ సిబ్బంది వస్తారు.

రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేయొద్దంటూ భారత్‌పై గత కొన్ని నెలలుగా అమెరికా తీవ్రమైన ఒత్తిళ్లు పెంచుతోంది. ఈ తరుణంలో పుతిన్ ఇండియాకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read: పుతిన్ కారు ఫీచర్స్, సెక్యూరిటీ వావ్.. అప్పట్లో మోదీ కూడా ఈ కారులో జర్నీ..