భారత అడవుల్లోకి ఆఫ్రికా చీతాలు..అనుమతిచ్చిన సుప్రీం

  • Published By: venkaiahnaidu ,Published On : January 29, 2020 / 03:59 PM IST
భారత అడవుల్లోకి ఆఫ్రికా చీతాలు..అనుమతిచ్చిన సుప్రీం

Updated On : January 29, 2020 / 3:59 PM IST

మళ్లీ మన దేశంలోకి చిరుతలు రాబోతున్నాయి. ఆఫ్రికాకు చెందిన చిరుతలను మన దేశంలోని అడవుల్లో ప్రవేశపెట్టేందుకు సుప్రీం కోర్టు అనుమతినిచ్చింది. దీంతో మధ్యప్రదేశ్ లోని నౌరదేహీ అభయారణ్యంలోకి చిరుతలను ప్రవేశపెట్టబోతున్నారు. నిజానికి ఆఫ్రికన్ చిరుత ప్రవేశం అంత ఆషామాషీగా జరగలేదు. విదేశీ జంతువును మన అడవుల్లో ప్రవేశపెడితే ఎలాంటి పరిణామాలుంటాయో అన్న సందేహంలో 2013 లో సుప్రీం కోర్టు అనుమతిని నిరాకరించింది. దాదాపు ఏడేళ్ల వేడుకోళ్ల తరువాత సుప్రీం కోర్టు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది. ప్రయోగాత్మకంగా కునో పాల్పుర్ అభయారణ్యంలోకి ప్రవేశపెట్టాల్సింది గా సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది.

చివరిసారిగా భారత జాతి చిరుతపులి చివరిసారిగా 1947లో కనిపించినట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. చిట్ట చివరి చిరుతను 1947 లో వేటగాళ్లు హతమార్చారు. పులులు, సింహాలు ఇతర జంతువులు ఎలాగోలా బ్రతికి బట్టకట్టినా చిరుత మాత్రం కనుమరుగైంది. అనంతరం 1952 నుంచి ఈ జాతి చిరుత పులులను అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చేర్చడం జరిగింది. అందుకే చిరుతల సంతతిని మళ్లీ మన దేశంలో మూడు కానుపులు, ఆరు బిడ్డలుగా చేయాలని వన్యసంరక్షణ ఉద్యమకారులు కోరుతున్నారు. వారి కోరిక మేరకే ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది. ఈ ప్రయోగం సఫలమైతే పెద్ద సంఖ్యలో చిరుతలను అడవుల్లోకి వదిలే ఏర్పాట్లు చేస్తారు.

భారతదేశంలో చిరుత పులులు అంతరించిపోతున్న నేపథ్యంలో జాతీయ పులుల సంరక్షణా సంస్థ (NTCA) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే నమీబియా నుంచి ఆఫ్రికన్ చిరుత పులులను భారత్‌కు తీసుకొచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్రప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ సర్వోన్నత న్యాయస్థానంను ఆశ్రయించింది. NTCA పిటిషన్ మేరకు సుప్రీం కోర్టు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని వేసింది. ఇందులో వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ రంజిత్ సింగ్, వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా డీజీ ధనంజయ్ మోహన్, కేంద్రపర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖలో డీఐజీని సభ్యులుగా నియమించింది. NTCAకు సూచనలు ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

ఇక కేసును విచారణ చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లు ఈ ప్రాజెక్టును తామే స్వయంగా పర్యవేక్షిస్తామని చెప్పారు. అంతేకాదు ప్రతి నాలుగు నెలలకోసారి కమిటీ నివేదికను తమ ముందు ఉంచుతుందని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తెలిపింది. ఆఫ్రికన్ జాతి చిరుతపులులు ఉండేందుకు ఏ అటవీ ప్రాంతం అయితే అనుకూలిస్తుందో దానిపై పూర్తిగా సర్వే చేయాల్సిన బాధ్యతను త్రిసభ్య కమిటీకి అప్పగించింది సుప్రీంకోర్టు. మధ్యప్రదేశ్‌లోని నౌరదేహీ వన్యప్రాణుల సంరక్షణా కేంద్రంలో ఆఫ్రికన్ జాతి చిరుత పులులను ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని త్రిసభ్య కమిటీ నివేదికలో పొందుపర్చింది.