వరుస ఎన్‌కౌంటర్లలో మావోయిస్టులకు భారీ ప్రాణనష్టం

2024లో ఇప్పటివరకు 120మంది వరకు మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో హతం అయ్యారని లెక్కలు చెబుతున్నాయి.

వరుస ఎన్‌కౌంటర్లలో మావోయిస్టులకు భారీ ప్రాణనష్టం

Setback to Maoists: ఛత్తీస్‌గడ్‌‌లో పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్లు ఇప్పట్లో ఆగే పరిస్థితి పరిస్థితి కనిపించడం లేదు. కొన్నాళ్లుగా నక్సలైట్లు..పోలీసు బలగాల మధ్య నువ్వానేనా అన్నట్లుగా కాల్పులు జరుగుతున్నాయి. లేటెస్ట్‌గా నారాయణ్‌పూర్ జిల్లాలోని కుతుల్, ఫరస్ భేడ, దంతెవాడ, కొడతమెట్ట అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఓ జవాను కూడా ప్రాణాలు కోల్పోవడంతో పాటు మరో ఇద్దరికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. కాల్పుల తీవ్రతను బట్టి చూస్తే భారీగానే మావోయిస్టులు చనిపోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఛత్తీస్‌గడ్ అంటే ఒకప్పుడు పేదరికం, గిరిజనుల సమస్యలు మాత్రమే గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు వరుస ఎన్‌కౌంటర్లతో హాట్ టాపిక్‌ అవుతోంది. గత రెండు నెలల వ్యవధిలోనే అబూజ్‌మడ్‌ అడవుల్లో వరుసగా భారీ ఎన్‌కౌంటర్లు జరిగాయి. నక్సలైట్ల ఏరివేతే లక్ష్యంగా జరుగుతోన్న ఆపరేషన్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని నాలుగు జిల్లాలకు చెందిన రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ సిబ్బంది పాల్గొంటున్నారు.

ఈ ఏడాది మార్చి 14న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏకంగా 79 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇదే ఏడాది మార్చి 27న బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు నక్సలైట్లు చనిపోయారు. ఏప్రిల్ 2న బీజాపూర్‌లోని గంగలూరు ఎన్‌కౌంటర్‌లో 13 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఏప్రిల్ 16న కంకేర్‌లో 29 మంది నక్సలైట్లు నేలకొరిగారు. ఏప్రిల్ 30న అబూజ్‌మడ్‌లోని టెక్‌మెటాలో 10 మంది మావోయిస్టులు చనిపోయారు. మే 10న బీజాపూర్ జిల్లాలోని పీడియాలో 12 మంది నక్సలైట్లు హతమయ్యారు. ఇలా ఈ మూడు నెలల్లోనే వందమంది వరకు మావోయిస్టులు హతమై ఉంటారన్న అంచనాలున్నాయి.

మావోయిస్టుల ఏరివేత పేరుతో అడవుల్లో బలగాల మోహరింపు.. దానికి కౌంటర్‌గా పోలీసులే లక్ష్యంగా మందుపాతరలతో నక్సల్స్‌ ప్రతివ్యూహాలతో ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో టెన్షన్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. మావోయిస్టులు పెట్టిన మందుపాతరలకు గిరిజనులు బలవుతున్నారు.

మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న అబూజ్‌మడ్‌ అడవులను చుట్టుముట్టాయి బలగాలు. గడిచిన ఆరు నెలల్లో 11 ఎన్‌కౌంటర్లలో 119 మంది మావోయిస్టులు చనిపోయారు. 2019 నుంచి వరుస ఎన్‌కౌంటర్లతో బలం కోల్పోతుంది మావోయిస్టు పార్టీ. ప్రతీ ఎన్‌కౌంటర్‌లో పదుల సంఖ్యలో మావోయిస్టులు హతమవుతుండటంతో.. ఉక్కిరిబిక్కరి అవుతోంది పార్టీ. ఎన్‌కౌంటర్లలో మావోయిస్ట్ అగ్రనేతలు ప్రాణాలు కోల్పోతుండటం వారికి మరింత ఆందోళన కలిగిస్తుంది.

Also Read: జాతీయ భద్రతా సలహాదారుగా మూడోసారి కూడా అజిత్ ధోవల్.. ఎందుకో తెలుసా?

2019లో జరిగిన ఎన్‌కౌంటర్లలో 65మంది మావోయిస్టులు చనిపోయారు. 2020లో 36మంది, 2021లో 47మంది, 2022లో 30మంది, 2023లో 24మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 2024లో ఇప్పటివరకు 120మంది వరకు మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో హతం అయ్యారని లెక్కలు చెబుతున్నాయి.

కేంద్ర హోంశాఖ లెక్కల ప్రకారమే అబూజ్‌మడ్‌ అడవుల్లో 450మంది మావోయిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి రెండేళ్ల కిందటి లెక్కలు. ఈ రెండు మూడేళ్లలో దాదాపు 350మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర హోంశాఖ అంచనాల ప్రకారం ఇంకో 150 మంది మావోయిస్టులే ఉన్నట్లు లెక్క. ఆ 150 మందిలో ఉన్నదంతా మావోయిస్ట్ పార్టీ టాప్ లీడర్లేనన్న ప్రచారం ఉంది. వాళ్ళు కూడా అనారోగ్య సమస్యలు, వయస్సురిత్య ఇబ్బంది పడుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంచనాలతో త్వరలోనే సమూలంగా మావోయిస్టుల ఏరివేత పూర్తి చేస్తామని అంటున్నారు భద్రతాబలగాలు.