Sister Abhaya Murder : 28 ఏళ్లు విచారణ, ఇద్దరికీ జీవిత ఖైదు

Sister Abhaya Murder: Kerala priest : కేరళలో 1992లో జరిగిన సిస్టర్ అభయ (Sister Abhaya)హత్య కేసులో తిరువనంతపురం సీబీఐ కోర్టు (CBI Court) దోషులకు శిక్ష ఖరారు చేసింది. 28 ఏళ్ల విచారణ అనంతరం కోర్టు తన తీర్పు వెలువరించింది. ఫాదర్ తామస్ కొత్తూర్, నన్ సెఫీలను దోషులుగా నిర్థారిస్తూ జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది కోర్టు. కేరళలో సంచలనం సృష్టించిన ఈకేసులో దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ కాలం పాటు విచారణ కొనసాగింది. 1992 మార్చి 27న కొట్టాయం (Kottayam)లోని సెయింట్ పియస్ ఎక్స్ కాన్వెంట్‌లో ఉన్న ఓ బావిలో క్రైస్తవ సన్యాసిని 21 ఏళ్ల అభయ శవమై తేలింది.
ప్రమాదవశాత్తు అభయ బావిలో పడి మరణించి ఉండవచ్చునని పోలీసులు తొలుత కేసు ఫైల్ చేశారు. కానీ ఈ కేసుపై మానవ హక్కుల కార్యకర్తలు కోర్టుకు వెళ్లడంతో కేసు 1993లో సీబీఐ (Central Bureau of Investigation) విచారణకు వెళ్లింది. ఆ తర్వాత జరిగిన విచారణలో సిస్టర్ అభయ ప్రమాదవశత్తు చనిపోలేదని.. పథకం ప్రకారమే అభయ పని చేస్తున్న స్కూల్‌కు చెందిన మతప్రబోధకుడు థామత్ కొత్తూర్ (Thomas Kotoor), సిస్టర్ సెఫీ (Sister Sephy) లు కొట్టి చంపినట్టు విచారణలో తేలింది. 28 ఏళ్లుగా ఈ కేసుపై విచారణ కొనసాగుతూనే ఉంది. అభయ కుటుంబసభ్యులతో పాటు మానవ హక్కుల కార్యకర్తలు, సామాజికవేత్తలు ఈ కేసుపై పోరాటం చేశారు. అభయ తల్లిదండ్రులు నాలుగేళ్ల క్రితమే మరణించారు. సుదీర్ఘ కాల విచారణ అనంతరం దోషులకు శిక్ష పడటంతో న్యాయం గెలిచిందని అభయ మద్దతుదారులు అంటున్నారు.