Solar Eclipse 2025: ఈ సూర్యగ్రహణ ప్రాముఖ్యత ఏంటి? ఆ సమయంలో ఏం చేయకూడదు? ఫుల్ డీటెయిల్స్..

భారత్‌ నుంచి ఈ సూర్యగ్రహణం కనపడదు.

Solar Eclipse 2025: ఈ సూర్యగ్రహణ ప్రాముఖ్యత ఏంటి? ఆ సమయంలో ఏం చేయకూడదు? ఫుల్ డీటెయిల్స్..

Solar Eclipse 2025

Updated On : March 28, 2025 / 4:34 PM IST

భారత్‌లో శనివారం సూర్య గ్రహణం ఏర్పడనుంది. సూర్యగ్రహణాన్ని దైవ సంబంధమైన విషయంగానూ భారత్‌లో భావిస్తారు. భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఆ సమయంలో భూమి మీద తాత్కాలికంగా సూర్యుడి వెలుతురు పాక్షికంగా లేదా పూర్తిగా పడదు.

దేశంలోని ఎన్నో రకాల సంస్కృతులు, నమ్మకాలు, అపోహల వల్ల సూర్య గ్రహణం గురించి ప్రజల్లో ఎన్నో రకాల భయాలు కూడా ఉన్నాయి. చాలా మంది ప్రజలు గ్రహణం సమయంలో ఆహారం తీసుకోకపోవడం, తర్వాత స్నానం చేయడం, ప్రత్యేక ప్రార్థనలు చేయడం వంటి పురాతన సంప్రదాయాలను పాటిస్తారు.

భారత్‌లో ఈ ఏడాది రెండుసార్లు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఒకటి మార్చి 29న, రెండోది సెప్టెంబరు 21న. ఖగోళ శాస్త్రవేత్తలకు సూర్యుడి బాహ్య వాతావరణం, కాంతి, ఇతర విషయాల గురించి అధ్యయనం చేయడానికి ఇది అరుదైన అవకాశం.

4 రకాల సూర్యగ్రహణాలు
సూర్యగ్రహణాలలో ప్రధానంగా నాలుగు రకాలు ఉన్నాయి. ఇందులో ఒకటి సంపూర్ణ సూర్య గ్రహణం. చంద్రుడు పూర్తిగా సూర్యుడిని అడ్డురావడం వల్ల భూమిపై కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా చీకటి కమ్ముకుంటుంది. దీన్ని సంపూర్ణ సూర్య గ్రహణం అంటారు.

రెండోది పాక్షిక సూర్య గ్రహణం. సూర్యుడిని కొంత భాగం మాత్రమే చంద్రుడు కనపడనివ్వకుండా చేస్తాడు. సూర్యుడి ఒక భాగం మాత్రమే కనిపిస్తుంది. దీన్నే పాక్షిక సూర్య గ్రహణం అంటారు.

మూడోది వలయాకార సూర్యగ్రహణం. చంద్రుడు సూర్యుడి మధ్య భాగాన్ని కప్పేసినప్పటికీ, చంద్రుడి పరిమాణం తక్కువగా ఉండటంతో సూర్యుడి అంచులు రింగ్ ఆకారంలో కనపడతాయి.

నాలుగోది హైబ్రిడ్ సూర్య గ్రహణం. ఈ గ్రహణం అరుదుగా సంభవిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణ గ్రహణంలా, మరికొన్ని ప్రాంతాల్లో వలయాకార గ్రహణంలా ఉంటుంది.

Also Read: కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా ఇలా చేశారు: వైఎస్‌ జగన్

సూర్యగ్రహణం మన దేశంలో కనిపిస్తుందా?
భారత్‌ నుంచి ఈ సూర్యగ్రహణం కనపడదు. పాక్షిక సూర్యగ్రహణం మార్చి 29న మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 4.17 గంటలకు గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. సాయంత్రం 6.13 గంటలకు ముగుస్తుంది. భారత్‌లో ఈ గ్రహణం కనపడకపోవడానికి కారణం భూమి అమరిక, సూర్యగ్రహణం సంభవిస్తున్న సమయమే. చంద్రుని నీడ మన దేశం మీద పడదు. దీన్ని భారతీయులు వర్చువల్‌గా ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూడొచ్చు.

భారత్‌లో సూర్య గ్రహణంపై జ్యోతిషశాస్త్రం, మతపరమైన నమ్మకాలు ఉన్నాయి. ఈ మత సంప్రదాయాలు లోతుగా పాతుకుపోయాయి. ఇటువంటి గ్రహణాల సమయంలో విశ్వ శక్తులలో అసమతుల్యత సంభవిస్తుందని, దీంతో పలు ఆచారాలు, జాగ్రత్తలు పాటించాల్సి వస్తుందని చాలా మంది నమ్ముతారు.

గ్రహణం సమయంలో ఆహారం తినరు, నీటిని తాగరు. కొంతమంది గ్రహణం గడిచిపోయే వరకు ఉపవాసం ఉంటారు. గాయత్రీ మంత్రం, మహామృత్యుంజయ మంత్రం వంటి మంత్రాలు జపిస్తారు. గర్భిణీ స్త్రీలు సూర్యగ్రహణం సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని మత పెద్దలు అంటుంటారు. నమ్మకాల ప్రకారం.. వారు ఇంటి లోపలే ఉండాలి. కత్తులు, కత్తెర వంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదు.

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
జాగ్రత్తలు తీసుకోకుండా సూర్యగ్రహాన్ని చూడటం చాలా ప్రమాదకరం. సూర్యుడిని చంద్రుడు పాక్షికంగా కప్పుతున్నప్పటికీ సూర్యకిరణాలు శక్తిమంతంగా ఉంటాయి. దీంతో నేరుగా చూడటం వల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. గ్రహణం గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పుడు సూర్యుడిని అస్సలు చూడొద్దు. ఒకవేళ చూస్తే హానికరమైన కిరణాలు రెటీనాను కాల్చివేస్తాయి. సూర్యగ్రహణాన్ని చూడాలంటే సోలార్‌ వ్యూయింగ్‌ గ్లాసెస్‌ను వాడాలి.