Night Curfew Delhi : ఢిల్లీలో కరోనా విజృంభణ.. ఈరోజు నుంచే నైట్ కర్ఫ్యూ అమల్లోకి

Starting Today, Night Curfew In Delhi From 10 Pm To 5 Am (1)
Night Curfew In Delhi : ఢిల్లీలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. రోజువారీ కొత్త కరోనాకేసులు ఎక్కువ అవుతున్నాయి. కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం (ఏప్రిల్ 6) నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధించనుంది కేజ్రీవాల్ ప్రభుత్వం. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఏప్రిల్ 30వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.
గత నెలలో దేశ రాజధానిలో కరోనా కొత్త ఇన్ఫెక్షన్లు పెరగడంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. కరోనా నాల్గో వేవ్ లోకి అడుగుపెడుతున్నప్పటికీ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డైన్ విధించే ప్లాన్ లేదని అన్నారు. కరోనా పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, ప్రజా అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఒక్క సోమవారం 3,548 కొత్త కేసులు నమోదు కాగా.. 15 మంది కరోనాతో మరణించారు. ఢిల్లీలో రాత్రి కర్ఫ్యూ సమయాల్లో ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఆంక్షలు లేవన్నారు.
అలాగే వ్యాక్సినేషన్ కోసం వెళ్లేవారికి తప్పనిసరిగా ఈ-పాస్ ఉంటేనే అనుమతించడం జరుగుతుందని అధికారులు వెల్లడించారు. నిత్యావసర వస్తువులు, రిటైలర్లలో ఎవరైనా రేషన్, గ్రాసరీ స్టాక్స్, కూరగాయలు, పాలు, మందులు వంటి కొనేందుకు ఇదే పాస్ లు చూపిస్తే అనుమతిస్తామని తెలిపారు. జర్నలిస్టులు, ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఐడీ కార్డులతో అనుమతి ఉందని చెప్పారు. ప్రైవేటు డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది వెళ్లేందుకు ఐడీ కార్డులు చూపిస్తే అనుమతించనున్నారు.
అత్యవసర చికిత్స అవసరమైనవారికి కూడా మినహాయింపు లభిస్తుంది. ఇదివరకే మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలు కూడా రాత్రిళ్లూ కర్ఫ్యూ విధించాయి. గత 24 గంటల్లో దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య మొదటిసారి లక్ష మార్క్ ను దాటేసింది. మహారాష్ట్రలో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు వీకెండ్ లాక్‌డౌన్ విధించగా.. రాజస్థాన్ రాత్రి కర్ఫ్యూ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు విధించింది.