Lockdown In India : దేశంలో లాక్‌డౌన్ దిశగా అడుగులు?
దేశంలో మళ్లీ లాక్‌డౌన్ తప్పదా? కరోనా కట్టడికి లాక్‌డౌన్‌నే శరణ్యమా? విలయం సృష్టిస్తోన్న కరోనాకు మూకుతాడు వేయాలంటే లాక్‌డౌన్ విధించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

Lockdown In India
Steps towards lockdown in the india? : దేశంలో మళ్లీ లాక్‌డౌన్ తప్పదా? కరోనా కట్టడికి లాక్‌డౌన్‌నే శరణ్యమా? విలయం సృష్టిస్తోన్న కరోనాకు మూకుతాడు వేయాలంటే లాక్‌డౌన్ విధించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే లాక్‌డౌన్ పెడితే ఆర్థికవ్యవస్థ మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని… కేంద్రం చెప్తోంది. కానీ ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమలవుతుండగా.. మరికొన్ని రాష్ట్రాలు, నగరాల్లో లాక్‌డౌన్ తరహా నిబంధనలు అమలవుతున్నాయి. ఇంకా కొన్ని సిటిల్లో నైట్ కర్ఫ్యూ, మినీ లాక్‌డౌన్ ఆంక్షలు విధిస్తున్నాయి.
దేశంలో కరోనా రక్కసితో ప్రజలు అల్లాడిపోతున్నారు. కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మృతుల సంఖ్య కూడా భారీగా నమోదవుతోంది. మందులు, ఆక్సిజన్, బెడ్లు దొరక్కా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీలో లాక్‌డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం. సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. కరోనాను కట్టడి చేయడానికి లాక్‌డౌన్ మినహా మరో మార్గం లేదన్నారు కేజ్రీవాల్. మే 3వ తేదీ వరకూ ఢిల్లీలో లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది.
కేరళలో ఇవాళ లాక్‌డౌన్ తరహా ఆంక్షలు అమలవుతున్నాయి. అత్యవసర సేవలు మినహాయించి అన్ని రంగాలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. అనవసరంగా బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ తిరిగినా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తున్నారు. మరో 24 గంటల పాటు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి మహారాష్ట్రలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. మృతుల సంఖ్య కూడా మహారాష్ట్రలోనే ఎక్కువగా ఉంది. దీంతో దేశంలో ఈ ఏడాది మొదటి సారి మహారాష్ట్ర కఠిన ఆంక్షలు అమలయ్యాయి. ఈ చర్యలు మంచి ఫలితాలను ఇచ్చినట్టు తెలుస్తోంది. కరోనా కేసుల పాజిటివిటి రేటు 18 నుంచి 15 శాతానికి తగ్గింది.
కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న వేళ… కర్నాటక ప్రభుత్వం కూడా లాక్‌డౌన్ ప్రకటించింది. ఇవాళ సాయంత్రం నుంచి 14 రోజుల పాటు లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి యడియూరప్ప తెలిపారు. అత్యసవర సర్వీసులకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. నిత్యావసరాల దుకాణాలు ఉదయం ఆరు గంటల నుంచి 10 గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. కరోనా సెకండ్ వేవ్‌తో కర్నాటక అతలాకుతలమవుతోంది. బెంగళూరు సహా అనేక ప్రాంతాలు వైరస్ హాట్‌స్పాట్‌లుగా మారాయి. వీకెండ్ కర్ఫ్యూ అమలు చేస్తున్నప్పటికీ…కరోనా ఉధృతి తగ్గకపోవడంతో లాక్‌డౌన్ విధించాలని కర్నాటక నిర్ణయించింది.
ఢిల్లీ తరహాలో కర్నాటక కూడా లాక్‌డౌన్ విధించడంతో ఇప్పుడు అందరి దృష్టి తెలుగు రాష్ట్రాలపై పడింది. మహారాష్ట్ర, ఢిల్లీలా కాకపోయినా…కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా ఎక్కువగానే ఉంది. రెండు రాష్ట్రాలూ నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నప్పటికీ పెద్దగా ఫలితం కనిపించడంలేదు. మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలివ్వడం.. స్కూళ్ల మూసివేత వంటి ఆంక్షలు అమలు చేస్తున్నా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు.
దీంతో ఏపీ, తెలంగాణల్లోనూ లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఆర్థిక భారం పడకుండా.. ప్రజలకు నష్టం జరగకుండా లాక్‌డౌన్ విధించేలా రెండు తెలుగు రాష్ట్రాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. మే 2 తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నిన్నటి నుంచి తిరుపతిలో మినీ లాక్‌డౌన్ అమలవుతోంది.
ఇప్పటికే కేంద్ర, రాష్ట్రాలు కరోనా కట్టడికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ.. కంటోన్మెంట్ జోన్ల ఏర్పాటు.. మరికొన్ని రాష్ట్రాల్లో పాక్షిక లాక్‌డౌన్‌ని అమలు చేస్తున్నారు. తెలంగాణలోని చాలా గ్రామాల్లో ప్రజలు స్వచ్చందంగా లాక్‌డౌన్ విధించుకున్నారు. మరోపైపు జనాలు విచ్చలవిడిగా బయటికి రావడం, కరోనా పేషెంట్లు కూడా క్వారంటైన్ పూర్తవకముందే రోడ్ల మీద తిరుగుతూ.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండటం ప్రభుత్వాలకు సవాల్‌గా మారింది.
దీంతో.. పాక్షిక లాక్‌డౌన్ పెడితేనే బాగుంటుందనే ఆలోచనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నట్లుగా సమాచారం. కేంద్ర ప్రభుత్వం మే నెల 2వ తేదీన ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించింది. మరో రెండు రోజుల్లోనే కట్టడి చర్యలపై పూర్తిస్థాయిలో సమీక్షించి.. పాక్షిక లాక్‌డౌన్‌పై కేసీఆర్ సర్కార్ ఓ నిర్ణయం తీసుకోనుంది.