SC on Delhi AQI: ఢిల్లీలో వాయు కాలుష్యంపై విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు.. మొదటి రోజే మొట్టికాయలు
చిన్న కారు రైతులు మిషనరీస్ పెట్టి పంటను ఏ విధంగా నాశనం చేస్తారని ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రైతులకు పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది

SC on Delhi AQI: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర స్థాయికి పెరిగిపోయిన వాయు కాలుష్యంలో సుప్రీంకోర్టు విచారణ చేసింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు దులియాతో కూడిన ధర్మాసనం మంగళవారం తొలిసారి దీనిపై వాదనలు విన్నది. కాగా, విచారణ అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. ఢిల్లీ పంజాబ్ ప్రభుత్వాల తీరుపై ఆసహనం వ్యక్తం చేసింది. ఢిల్లీలో కాలుష్యం నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గత ఆరు నెలల్లో పోలిస్తే నవంబర్ మాసంలో ఢిల్లీలో అత్యధికంగా కాలుష్యం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.
కాలుష్య నియంత్రణకు అన్ని రాష్ట్రాలు కఠినమైన నిబంధనలు తీసుకురావాలని సుప్రీంకోర్టు సూచించింది. అయితే ఇదే సందర్భంలో రైతుల పట్ల దేశ అత్యున్నత ధర్మాసనం సానుభూతి తెలిపింది. కాలుష్యం అంశాన్ని ప్రతిసారి రైతులపై నట్టేయడం సరికాదని అభిప్రాయపడింది. ప్రతిసారి రైతులను విలన్లుగా చూపడం రాష్ట్ర ప్రభుత్వాలకు అలవాటు అయిందని మొట్టికాయలు వేసింది. అయితే ఇదే సమయంలో పంటను కాల్చేందుకు హర్యానా ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు ఎందుకు ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలు ఇవ్వటం లేదని ప్రశ్నించింది.
చిన్న కారు రైతులు మిషనరీస్ పెట్టి పంటను ఏ విధంగా నాశనం చేస్తారని ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రైతులకు పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. అనంతరం ఈ కేసు విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.