నిర్భయ కేసు…తీర్పు సమయంలో సొమ్మసిల్లి పడిపోయిన జడ్జి

నిర్భయ గ్యాంగ్ రేప్,మర్డర్ కేసులోని నలుగురు దోషులను విడివిడిగా ఉరితీసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ(ఫిబ్రవరి-14,2020) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే తీర్పు ఇచ్చే సమయంలో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఆర్ భానుమతి కోర్టురూములోనే సొమ్మసిల్లి పడిపోయారు.
అయితే వెంటనే ఆమె తేరుకుని సృహలోకి వచ్చారని,డయాస్ పై ఉన్న ఇతర జడ్జిలు,సుప్రీంకోర్టు సిబ్బంది ఆమెను ఛాంబర్ కు తీసుకెళ్లినట్లు సమాచారం. వీల్ చైర్ లో ఆమెను మెడికల్ ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్లారు. ఈ పిటిషన్ విషయంలో తీర్పును ఛాంబర్ లో ఇవ్వబడుతుందని జస్టిస్ ఏఎస్ బోపన్న తెలిపారు.
అంతకుముందు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడంపై నిర్భయ కేసులోని దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ భానుమతితో కలిపి జస్టిస్ అశోక్ భూషణ్,ఏఎస్ బొప్పన్న నేతృత్వంలోని బెంచ్ తోసిపుచ్చింది. జైల్లో తీవ్రమైన టార్చర్ కారణంగా వినయ్ శర్మ మానసిక స్థితి సరిగా లేదని, క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే సమయంలో ఆ విషయాన్ని రాష్ట్రపతి పరిగణించలేదని అతని తరపు లాయర్ వాదించారు. అతను మానసిక అనారోగ్యంతో ఉన్నాడని చెప్పే మెడికల్ రికార్డులు రాష్ట్రపతి వద్దకు రాలేదని కోర్టుకు తెలిపారు. కాగా, ఈ వాదనల్ని కేంద్రం తోసిపుచ్చింది. వినయ్ శర్మ మానసిక స్థితి బాగానే ఉందని కోర్టు దృష్టికి తెచ్చింది. ఫిబ్రవరి 12 నాటి మెడికల్ రికార్డుల ప్రకారం వినయ్ ఆరోగ్య స్థితికి ఇబ్బందేం లేదని కేంద్రం తరపు లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. కేంద్రం వాదనతో ఏకీభవించిన సుప్రీం కోర్టు వినయ్ పిటిషన్‌ను కొట్టివేసింది.
2012లో నిర్భయ ఘటన జరగగా..ఇప్పటికి రెండుసార్లు డెత్ వారెంట్లు జారీ అయినప్పటికీ కూడా రెండు సార్లు దోషులకు ఉరిశిక్ష వాయిదా పడింది. దోషులు చట్టంలో ఉన్న లోసుగులను వంతెనాగా వేసుకుని… ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
Read Here>>డేంజర్ బెల్స్.. ఒక్కసారిగా 50వేల మందికి కరోనా వైరస్