Gautam Gambhir: అక్రమంగా మెడిసిన్ నిల్వ.. సుప్రీంకోర్టులో గంభీర్ కు ఎదురుదెబ్బ
కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఎంపీ గౌతమ్ గంభీర్ అత్యవసర మందులను అక్రమంగా నిల్వ చేశారంటూ నమోదైన కేసులో సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

Gambhir
Supreme Court Refuses To Grant Gautam Gambhir Relief In COVID Drugs Case: కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఎంపీ గౌతమ్ గంభీర్ అత్యవసర మందులను అక్రమంగా నిల్వ చేశారంటూ నమోదైన కేసులో సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు ఆదేశాల మేరకు తన సంస్థపై జరుగుతున్న చర్యలను ఆపాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు. ప్రజలు మందుల గురించి ఆందోళన చెందుతున్నప్పుడు, సహాయం పేరిట మెడిసిన్ను ఉంచుకోవడం తప్పు అని అభిప్రాయపడ్డారు న్యాయమూర్తులు.
బీజేపీ ఎంపీగా ఉన్న మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ భారీ మొత్తంలో ఫాబీ ఫ్లూ మెడిసిన్ను కొనుగోలు చేసి సరఫరా చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే తప్పుబట్టింది. ఈ క్రమంలోనే మార్కెట్‌లో తీవ్ర కొరత ఉన్న మెడిసిన్ని గంభీర్ ఎలా కొనుగోలు చేశారో విచారణ జరపాలని ఢిల్లీ ఔషధ నియంత్రణ అధికారిని ఆదేశించింది. ఈ ఆదేశాలను ఆపాలంటూ గంభీర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. సోమవారం దీనిపై విచారణ చేపట్టింది ధర్మాసనం.
ఈ విషయంలో ఉపశమనం కోరుతూ గంభీర్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. న్యాయమూర్తులు డి.వై.చంద్రచుడ్, ఎం.ఆర్ షాలతో కూడిన ధర్మాసనం కుదరదు అని స్పష్టం చేసింది. గంభీర్ ఉద్దేశం మంచిదే అయినా దాని వల్ల సమాజానికి నష్టం కలుగుతోందని, మార్కెట్‌లో మెడిసిన్ కొరత ఏర్పడుతోందని అభిప్రాయపడింది. సామాన్యులు ఇబ్బంది పడినట్లు గుర్తించింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో గంభీర్ తరఫున లాయర్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.
గంభీర్ పై హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. 2,345 స్ట్రిప్పుల ఫాబీ ఫ్లూ మాత్రలను గంభీర్ కొనుగోలు చేయడంపై మండిపడింది. బయట మార్కెట్‌లో తీవ్ర కొరత ఉన్న మెడిసిన్ను ఎలా బ్లాక్ చేస్తారని, మంచిపని కోసం చేసినా తప్పే అని తప్పుబట్టింది.