మోడీ ప్రభుత్వానికి బిగ్ షాక్: అలోక్ వర్మే సీబీఐ డైరక్టర్
మోడీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ వ్యవహారంలో సుప్రీం కీలక తీర్పునిచ్చింది. అవినీతి ఆరోపణలతో సీబీఐ డైరక్టర్ పదవి నుంచి అలోక్ వరక్మను అర్థరాత్రి అర్థాంతరంగా కేంద్రం తప్పించడాన్ని సప్రీం తప్పుబట్టింది. అలోక్ వర్మకు తిరిగి సీబీఐ డైరక్టర్ గా బాధ్యతలు అప్పగించాలని సుప్రీం మంగళవారం(జనవరి-8,2019) తీర్పు వెలువరించింది. మూడు నెలలుగా కొనసాగుతున్న సీబీఐ వర్సెస్ సీబీఐ వార్ లో అలోక్ వర్మ విజయం సాధించారు.
అలోక్ వర్మను అర్థాంతరంగా సెలవుపై పంపించే అధికారం ప్రభుత్వానికి లేదని ఈ సందర్భంగా సుప్రీం తెలిపింది. ప్రధాని నేతృత్వంలోని హై పవర్ కమిటీ మీట్ అయి అలోక్ భవిష్యత్తుకి సంబంధించి వారంలోగా నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. అప్పటివరకు సీబీఐ డైరక్టర్ గా అలోక్ వర్మ పాలసీలకు సంబంధించి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకూడదని సుప్రీం ఈ సందర్భంగా తెలిపింది. ఈ హైపర్ కమిటీలో ప్రతిపక్ష నేత, సీజేఐ ఉంటారు. సీబీఐ డైరక్టర్ ను నియమించే బాధ్యతను కూడా ఈ కమిటీ తీసుకొంటుంది.
2018 అక్టోబర్ లో సీబీఐ డైరక్టర్ గా ఉన్న అలోక్ వర్మ, డిప్యూటీ డైరక్టర్ రాకేష్ ఆస్తానాలు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో అర్థరాత్రి అర్ధాంతరంగా వర్మ, ఆస్తానాలను సెలవుపై పంపిస్తూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన మన్నె నాగేశ్వరరావును సీబీఐ తాత్కాలిక డైరక్టర్ గా కేంద్రం నియమించింది. కేంద్రప్రభుత్వ నిర్ణయంపై వర్మ సుప్రీంని ఆశ్రయించారు. ఈ కేసులో వాదనలు విన్న సుప్రీం మంగళవారం సీబీఐ డైరక్టర్ గా అలోక్ వర్మను తిరిగి నియమిస్తూ తీర్పు వెలువరించింది.