Supreme Court: సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. రాష్ట్రాల బిల్లులపై రాష్ట్రపతికీ గడువు విధింపు.. మూన్నెళ్లలో తేల్చాల్సిందే..
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ఆమోదం లేకుండానే బిల్లులను చట్టాలుగా మారుస్తూ గెజిట్ విడుదల చేసింది.

Supreme Court
Supreme Court: సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. శాసనసభలు ఒకటికి రెండు సార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవీ తీవ్ర జాప్యానికి గురికావడంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించకుండా తన వద్దే ఉంచుకోవడం సరికాదని ఈనెల 8న సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే, శుక్రవారం రాత్రి 415 పేజీల ద్వారా ఆ తీర్పులోని పూర్తి వివరాలను సుప్రీంకోర్టు వెబ్ సైట్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది.
గతంలో ఎప్పుడూ లేనివిధంగా గవర్నర్ తో పాటు రాష్ట్రపతికీ సుప్రీంకోర్టు గడువు విధించింది. మూడు నెలల్లోగా శాసనసభలు ఆమోదం పొందిన బిల్లును ఆమోదించడమో, తిప్పి పంపించడమో చేయాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపిస్తున్నట్లయితే అందుకు కారణాలనూ వివరించాలని తెలిపింది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని నేరుగా ఆశ్రయించవచ్చని, గవర్నర్ల నిర్ణయం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగ అధికారణం 142 ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని జస్టిస్ జెబి పార్థీవాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్ ధర్మాసనం తేల్చి చెప్పింది.
‘‘బిల్లులకు ఆమోదం తెలిపే, తిరస్కరించే, రాష్ట్రపతికి పంపించే అధికారాన్ని గవర్నర్లకు రాజ్యాంగ అధికరణం 200 కల్పించింది. దాని అర్ధం బిల్లులపై ఎప్పటికీ నిర్ణయం తీసుకోకుండా ఉండమని కాదు. రాష్ట్ర శాసనసభ రెండోసారి ఆమోదించి పంపించినట్లయితే ఆ బిల్లుకు గవర్నర్ వెంటనే ఆమోదం తెలపాలి. గరిష్ఠంగా నెలకు మించి సమయం తీసుకోరాదు. అటువంటి బిల్లులను పూర్తిగా నిలిపివేయడం, లేదా తిరస్కరించే అధికారం గవర్నర్‌కు లేదు. రాజ్యాంగ అధికరణం 201 ప్రకారం రాష్ట్రపతికి కూడా అటువంటి బిల్లులను తిరస్కరించే అధికారం లేదు.’’ అంటూ సుప్రీంకోర్టు పేర్కొంది.
తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం..
సుప్రీంకోర్టు తీర్పు కాపీ పబ్లిష్ అయిన వెంటనే తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం లేకుండానే 10 బిల్లులను చట్టాలుగా అమలు చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం పొందని బిల్లును చట్టంగా అమలు చేస్తూ గెజిట్ జారీ చేయడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి.