తమిళగ వెట్రి కళగం పార్టీ జెండా ఆవిష్కరణ.. విజయ్ పార్టీ జెండాలో ఏమేమి ఉన్నాయంటే..?

స్టార్ హీరో విజయ్‌ పార్టీ, జెండా గురించి తమిళనాడులో పెద్ద చర్చే జరుగుతోంది. ఇంతకీ ఆ జెండాకు అర్థమేంటి..?

తమిళగ వెట్రి కళగం పార్టీ జెండా ఆవిష్కరణ.. విజయ్ పార్టీ జెండాలో ఏమేమి ఉన్నాయంటే..?

TVK flag what do its colour and emblem signify explained

Tamilaga Vettri Kazhagam Flag: తమిళనాడులో ఎన్నికలకు రెండేళ్ల ముందే పొలిటికల్‌ హీట్‌ అమాంతం పెరుగుతోంది. ఇప్పట్నుంచీ ఒక లెక్క.. ఇకపై ఒక లెక్క అనేలా మారింది. ఇన్నాళ్లూ డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్య దోబూచులాడిన రాజకీయ చదరంగంలో ఇప్పుడు మరో స్టార్‌ హీరో ఎంట్రీ ఇచ్చారు. దళపతిగా సినీరంగంలో చెరగని ముద్ర వేసిన తమిళ హీరో విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీతో సెన్సేషన్‌ క్రియేట్‌ చేశారు. తమిళగ వెట్రి కళగం పేరుతో ఈ ఏడాది ఆయన కొత్త పార్టీని ఏర్పాటుచేశారు. ఇప్పుడు ఆ పార్టీ సంబంధించి జెండాను కూడా ఆవిష్కరించడంతో తమిళనాడులోనే కాక.. దేశవ్యాప్తంగా ఇది పొలిటికల్‌ బజ్‌ క్రియేట్‌ చేస్తోంది.

విజయ్ మరో ముందడుగు
తమిళ రాజకీయాల్లో పొలిటికల్‌ హీట్‌ అమాంతం పెరిగింది. పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మరో అడుగు ముందుకేశారు. తన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ జెండాను ఆవిష్కరించారు. అలాగే పార్టీ గీతాన్ని కూడా విడుదల చేశారు. చెన్నైలోని పనయూర్‌లోని పార్టీ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో విజయ్ తల్లిదండ్రులు, ఫ్యాన్స్‌, పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పార్టీ సిద్ధాంతాలను తెలుపుతూ జెండా, అజెండాను ప్రజల ముందు ఆవిష్కరించారు విజయ్‌.

కార్యకర్తలతో ప్రతిజ్ఞ
జెండా ఆవిష్కరణ తర్వాత కార్యకర్తలతో కలిసి విజయ్‌ ప్రతిజ్ఞ చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన యోధులను, తమిళ నేల నుంచి వెళ్లి మన హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన అసంఖ్యాక సైనికులను ఎప్పటికీ గుర్తుంచుకుంటామన్నారు. కులం, మతం, లింగం, ప్రాంతం పేరుతో జరుగుతున్న వివక్షను టీవీకే పార్టీ తొలగిస్తుందని భరోసా ఇచ్చారు. ప్రజలకు అవగాహన కల్పించి అందరికీ సమానహక్కులు, అవకాశాల కోసం కృషి చేస్తామన్న విజయ్‌.. సమానత్వం అనే సూత్రాన్ని బలంగా సమర్థిస్తామని స్పష్టం చేశారు.

ఆ జెండాకు అర్థమేంటి?
మరో రెండేళ్లలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో విజయ్‌ పార్టీ, జెండా గురించి పెద్ద చర్చే జరుగుతోందక్కడ. ఇంతకీ ఆ జెండాకు అర్థమేంటి..? అందులో ఉన్న గుర్తులేంటని విజయ్‌ అభిమానులు, ఇతర రాజకీయ పార్టీల నేతలు కూడా పెద్ద ఎత్తునే చర్చించుకుంటున్నారు. జెండాలో అడ్డంగా ఎరుపు, పసుపు, ఎరుపు రంగుల పట్టీలున్నాయి. మధ్యలో ఒక పువ్వు.. ఆ పువ్వు చుట్టూ పచ్చ రంగు నక్షత్రాలు.. అటు, ఇటు రెండు ఏనుగులు.. ఇదీ తమిళగ వెట్రి కళగం పార్టీ జెండాలో ఉన్న గుర్తులు.

విజయానికి ప్రతీకగా..
విజయ్ పార్టీ జెండా అందరినీ ఆకర్షించేలా ఉంది. ఎరుపు, పసుపు రంగులతో కూడిన ఈ జెండాలో మధ్యలో ఓ పువ్వు కనిపిస్తుంది. ఆ పువ్వుకి రెండు వైపులా ఏనుగులు ఉన్నాయి. ఇక ఈ జెండాలో మధ్యలో కనిపించే పువ్వు ఏంటా అని చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. కొంతమంది అయితే అది ఉదయించే సూర్యుడు అని భ్రమ పడుతున్నారు. కానీ ఆ పువ్వు పేరు వాగై పుష్పం. అంటే మన రోడ్ల పక్కన కనిపించే దిరిసెన చెట్టు అన్నమాట. తమిళంలో వాగై అంటే విజయానికి చిహ్నంగా భావిస్తారు. తమిళనాడు చరిత్రలో దీనికి చాలా గుర్తింపు ఉంది. పార్వతీదేవి మహిషాసురుడిని సంహరించే ముందు ఈ వాగై చెట్టు కింద ఘోర తపస్సు చేసినట్లు తమిళ పురాణాలు చెబుతున్నాయి. అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఉండేలా.. వాగై పుష్పం సూచిస్తుందని అంటున్నారు. అప్పట్లో చోళులు, పాండ్యులు పరిపాలించిన సమయంలో యుద్ధంలో గెలిచిన వారికి ఈ పూలతోనే దండలు చేసి స్వాగతం పలికేవారు. ఈ పూలని విజయానికి ప్రతీకగా చూస్తారు. అధినేత పేరు కూడా విజయ్‌ కాబట్టి ఈ పువ్వును పెట్టడం విజయ సూచికగా భావిస్తున్నారు .

అన్ని వర్గాల వారికోసం అనేలా..
పువ్వు చుట్టూ ఉన్న పచ్చరంగు నక్షత్రాలు అన్ని వర్గాల అభ్యున్నతిని కాంక్షించడాన్ని సూచిస్తోంది. ఏనుగులు దైవత్వం, పవిత్రతకు, బలానికి చిహ్నాలు. ఎరుపు రంగు కార్మిక, కర్షక లోకానికి ప్రతీక, పసుపు రంగు శుభకరానికి చిహ్నం.. ఇలా తమిళగ వెట్రి కళగం పార్టీ జెండాను అన్ని వర్గాల వారికోసం అనేలా ఈ రంగులతో రూపొందించారు. పార్టీ గీతం కూడా అందరినీ ఆకట్టుకునేలా జెండాను ప్రజలకు చేరువ చేసేలా రూపొందించారు. దీంతో విజయ్‌ టీవీకే పార్టీ ప్రజల్లోకి వేగంగా వెళ్తుందని భావిస్తున్నారంతా.

Also Read: కోల్‌క‌తా జూనియర్ వైద్యురాలి హత్యోదంతంలో భయంకర నిజాలు.. ఇంత ఘోరమా?

ఇక ఈ జెండాపై ప్రముఖ తమిళ కవి తిరువళ్లువర్‌ రాసిన ఓ కొటేషన్‌ కూడా ఉంది. “పిరపోక్కుమ్ ఎల్ల ఉయుర్కుమ్” అంటే పుట్టుకతో అందరూ సమానమే అని అర్థం అన్నమాట. అంటే తన పార్టీ సిద్ధాంతం ఏంటో చెప్పకనే చెప్పారు విజయ్.