జీతం డబ్బులతో: విద్యార్థుల ఆకలి తీరుస్తున్న టీచర్

భారత్ లో ఎంతోమంది పేదలు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు. స్కూల్లో చదువుకుంటునే ప్రభుత్వం పెట్టే మధ్యాహ్నా భోజనంతో కడుపు నింపుకుంటున్నారు. ఉదయం 9 గంటలకు స్కూల్ వచ్చే ఈ పేద పిల్లలంతా మధ్యాహ్నాం 1 గంటకు పెట్టే భోజన సమయం వరకూ ఖాళీ కడుపుతోనే ఉంటారు. దీంతో వారు నీరసంగా ఉండి టీచర్ చెప్పే పాఠాల్ని కూడా వినలేకపోతున్నారు. ఆకలితో నకనకలాడుతున్న కడుపుతో చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ఇది గమనించిన ఓ మాస్టరు వారికి స్కూల్ కు రాగానే తన స్వంత డబ్బులతో బ్రేక్ ఫాస్ట్ పెడుతున్నారు.
ఆ మాస్టారి పేరు అలమరన్. తమిళనాడులోని కొడుంగైయుర్ గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్నారు. ప్రతి నెలా తన జీతంలో నుంచి రూ. 5000లతో స్కూల్ లో ప్రతి రోజు ఒకటో తరగతి నుంచి 10వ తరగతి చదివే పిల్లలకు ఉచితంగా టిఫెన్ పెడుతున్నారు. దీంతో మధ్యాహ్నా భోజనం సమయం వరకూ వారు ఉత్సాహంతో పాఠాలు వింటుండం చూసి అలమరన్ సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
ఇంటి నుంచి ఏమీ తినకుండానే స్కూల్ వస్తున్న పిల్లలు చాలామంది కళ్లు తిరిగి పడిపోవడం,నీరసంగా ఉండటం, తలనొప్పి, వేసవిలో ఎండ దెబ్బతో మరింతగా నిస్సత్తువగా వుండటాన్ని అలమరన్ గమనించారు. దీంతో ఆయనకు పిల్లలకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం పూట అల్పాహారం కూడా పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అలా 10 సంవత్సరాలపాటు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగారు. కానీ… ప్రభుత్వం పట్టించుకోలేదు. ఓ పక్క ప్రభుత్వంపై బ్రేక్ ఫాస్ట్ గురించి పోరాడుతూనేఉన్నారు. కానీ ఎటువంటి స్పందనా రాలేదు. ప్రభుత్వం పట్టించుకోకపోయినా..తన కళ్లముందే తన విద్యార్థులు ఆకలితో అల్లాడిపోవటం చూసిన అలమరన్ బ్రేక్ ఫాస్ట్ పెట్టాలని నిర్ణయించుకుని అమలు చేస్తున్నారు.
అలా స్కూల్లో ఉన్న 120 మంది విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం అందిస్తున్నారు. దాని కోసం తన జీతంలో నుంచి నెలకు రూ. 5000లను ఖర్చుపెడుతున్నారు. స్కూల్ కు రాగానే బ్రేక్ ఫాస్ట్ తింటున్న పిల్లలు మంచి ఉత్సాహంగా ఉంటున్నారనీ..చక్కగా చదువుకుంటున్నారని ఆనందంగా చెప్పారు టీచర్ అలమరన్. ఈ టీచర్ లాంటి వారు స్కూల్ కు ఒక్కరుంటే చాలు కదూ..ఏ విద్యార్థి కూడా కడుపుడు ఆకలితో చదువుకోవాల్సి దుస్థితి ఉండదు.