ఎన్డీయేలో టెన్షన్ : బీహార్ సీఎంగా తేజస్వీ యాదవ్…విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థిగా నితీష్!

Tension in NDA camp గత వారం అరుణాచల్ ప్రదేశ్ లో 6గురు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఈ పరిణామం బీహార్ లోని జేడీయూ-బీజేపీ స్నేహబంధంపై ప్రభావం చూపే అవకాశమున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ రాష్ట్రంలో భాగస్వామ్య పక్షంగా ఉండి మరో రాష్ట్రంలో తమ ఎమ్మెల్యేలపై గాలం వేయడం రాజనీతి కాదని జేడీయూ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే బీహార్ వేదికగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు దేశ రాజకీయ చిత్రంలో కొత్త కూటమికి దారి తీసే విధంగా కనిపిస్తున్నాయి. జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను ఎన్డీయే కూటమి నుంచి వెనక్కి తీసుకొచ్చేలా ప్రతిపక్ష ఆర్జేడీ ప్రణాళికలు రచిస్తోంది. అపర చాణికుడ్యిని తమ వైపుకు తిప్పకుంటే ఇక తమకు తిరుగేలేదని భావిస్తోంది. దీనిలో భాగంగానే మంగళవారం(డిసెంబర్-29,2020) ఆర్జేడీ సీనియర్ నాయకుడు, బీహార్ మాజీ స్పీకర్ ఉదయ్ నారాయణ్ చౌదరి చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
నితీశ్ కుమార్ ఎన్డీఏ కూటమిని వీడి మహఘట్‌బంధన్‌లో చేరి తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రిని చేయాలని చౌదరి అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వీ యాదవ్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, అతిపెద్ద పార్టీగా అవతరించిన తమకు సీఎం పగ్గాలు అప్పగించాలని కోరారు. బీహార్ ముఖ్యమంత్రి పీఠం తేజస్వీ యాదవ్‌కు అప్పగిస్తే.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నితీష్‌ను ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకుంటామని బంపరాఫర్ ఇచ్చారు.
విపక్ష నేతలందరితో చర్చించి 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా నితీష్ పేరుని ప్రకటిస్తామని చౌదరి పేర్కొన్నారు. దానికి ఆర్జేడీ సిద్ధంగా ఉందని, నితీష్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే ఆర్జేడీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నితీష్ కుమార్ ఇంకా బీజేపీ మైనర్ భాగస్వామ్య పక్షంగా ఉండాల్సిన పరిస్థితి దాపరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమయం చూసుకొని బీజేపీ సైతం జేడీయూను వదిలించుకోవాలని చూస్తున్నదని చౌదరి తెలిపారు. ప్రాంతీయ, చిన్నాచితకా పార్టీలు బీజేపీకి నచ్చవని.. వాటిని నాశనం చేయడమే ఆ పార్టీ లక్ష్యమని చౌదరి విమర్శించారు.
మరోవైపు, మొన్నటి వరకు జేడీయూ అధ్యక్షుడిగా కొనసాగిన నితీష్.. ఇటీవల ఆ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. తన సన్నిహితుడు,రాజ్యసభ ఎంపీ ఆర్‌సీపీ సింగ్‌కు జేడీయూ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు నితీష్. ఈ పరిణామం జరిగిన గంటల వ్యవధిలోనే నితీష్ కుమార్ మరో బాంబు పేల్చారు. ముఖ్యమంత్రి పదవి తనకు అక్కర్లేదన్నారు. తనకు ఈ పదవిపై ఏ మాత్రం వ్యామోహం లేదని.. బీజేపీ నేతల ఒత్తిడి మేరకే సీఎం బాధ్యతలు చేపట్టానని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నితీష్ వ్యాఖ్యలు ఎన్‌డీఏ కూటమిలో కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఆర్జేడీ ఇచ్చిన ఆఫర్ చర్చనీయాంశంగా మారింది.