10th Results: ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా విద్యార్ధులను పాస్ చేయాలి

  • Published By: dharani ,Published On : June 10, 2020 / 05:01 AM IST
10th Results: ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా విద్యార్ధులను పాస్ చేయాలి

Updated On : June 10, 2020 / 5:01 AM IST

పదోతరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల జాబితాలను సిద్ధంగా ఉంచుకోవాలని విద్యాశాఖ అన్ని పాఠశాలలకు ఆదేశాలు ఇచ్చింది. ఎందుకంటే పదోతరగతి విద్యార్థులను ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా పాస్‌ చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను 10, 12 రోజుల్లో పూర్తి చేసి ఫలితాలను వెల్లడించేందుకు బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు.  

మంగళవారం రాత్రి లేదా బుధవారం ఇవి విడుదల చేసే అవకాశం ఉంది. వాటితోపాటు కోర్టులోనూ కేసు ఉన్నందున కోర్టుకు తెలియజేయాల్సిన అంశాలపైనా అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ)తో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రాంచంద్రన్‌ చర్చించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, GHMCలోని ప్రాంతాలు మినహా మిగతా చోట్ల పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు తీర్పు చెప్పగా ప్రభుత్వం పరీక్షలనే రద్దు చేసింది. ఈ విషయాన్ని హైకోర్టుకు తెలియజేయాలని అధికారులు నిర్ణయించారు.

మంత్రి సబిత మాట్లాడుతూ.. త్వరలోనే ఫలితాలను ప్రకటిస్తామన్నారు. పదో తరగతి ఫలితాలు పారదర్శకంగా ఉంటాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యాదగిరి శేఖర్‌రావు, మధుసూదన్‌ తదితరులు మంగళవారం హైదరాబాద్‌లో మంత్రిని కలిశారు.   

విద్యార్థుల ఇంటర్నల్‌ మార్కులను స్కూళ్ల యాజమాన్యాలు ఆన్‌లైన్‌లో పంపినందున ఆ మార్కులను ఎవరూ మార్చే ప్రయత్నం చేయడం సాధ్యం కాదన్నారు. ఆన్‌లైన్‌లో అందిన మార్కులకు సైబర్‌ భద్రత ఉందని, తద్వారా ఫలితాల్లో పారదర్శకత ఉంటుందన్నారు. విద్యార్థులకు ఇంటర్నల్స్‌లో వచ్చిన వాస్తవ మార్కుల ఆధారంగానే ఫలితాలు ఉంటాయని ఆమె వివరించారు.