అంతర్జాతీయ దౌత్యం ఎలా చేయాలో మోడీకి నేర్పించండి

అంతర్జాతీయ దౌత్యం ఎలా చేయాలో ప్రధాని మోడీకి కొంచెం నేర్పాలని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ ను కోరారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ఇటీవల అమెరికాలోని హ్యూస్టన్ లో జరిగిన హౌడీ మోడీ కార్యక్రమానికి భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కలిసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమ సమయంలో అబ్ కీ బార్ ట్రంప్ సర్కర్(మరోసారి ట్రంప్ సర్కార్)అని మోడీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.
విదేశీ రాజకీయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారంటూ మోడీ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో ఈ విషయంపై మంగళవారం(అక్టోబర్-1,2019) విదేశాంగ శాఖమంత్రి జై శంకర్ స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న జైశంకర్ ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నప్పుడు మోడీ వ్యాఖ్యలు గురించి భారతీయ జర్నలిస్టులు అడగగా..మరోసారి ట్రంప్ సర్కారే అధికారంలోకి రావాలని మోడీ చెప్పలేదని,మోడీ వ్యాఖ్యలు తప్పుగా వక్రీకరించారని ఆయన అన్నారు. మోడీ ప్రసంగాన్ని చాలా జాగ్రత్తగా వినాలని ఆయన సూచించారు. మరోసారి అమెరికా అధ్యక్ష బరిలో నిలుస్తున్న ట్రంపే అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అనే పదాన్ని వాడారని,దాని గురించే మోడీ ఆ సభలో మాట్లాడారని తెలిపారు.
ప్రధాని మోడీ అతను ఏమి మాట్లాడుతున్నాడో చాలా స్పష్టంగా చెప్పాడని అన్నారు. ట్రంప్ ను ఉద్దేశించి..ఓ అభ్యర్థిగా మీరు ఆబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అని చెప్పారని మోడీ ఆ సభలో గుర్తుచేశాడని,భారత్,భారతీయ అమెరికన్లకు కనెక్ట్ అయ్యేందుకు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను మోడీ ప్రస్తావించాడని జైశంకర్ తెలిపారు. విదేశీ రాజకీయాల్లో తాము జోక్యం చేసుకోబోమని తెలిపారు. అమెరికాలో ఏమి జరిగినా అది వారి రాజకీయాలు అని భారత రాజకీయాలు కాదని జైశంకర్ అన్నారు
అయితే మోడీ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని జైశంకర్ అనడాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ తీవ్రంగా ఆక్షేపించారు. ప్రధాని మోడీ అసమర్థత్వాన్ని కప్పిపుచ్చుతన్న విదేశాంగ శాకమంత్రికి థ్యాంక్స్ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. అంతర్జాతీయ దౌత్యం ఎలా చేయాలో జైశంకర్ మోడీకి కొంచెం నేర్పాలంటూ ట్వీట్ లో తెలిపారు.