కేంద్రంతో చర్చలకు అంగీకరించిన రైతు సంఘాలు

కేంద్రంతో చర్చలకు అంగీకరించిన రైతు సంఘాలు

Updated On : December 26, 2020 / 6:03 PM IST

farmers’ unions finally agreed to negotiate : ఎట్టకేలకు రైతుసంఘాలు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు అంగీకరించాయి. డిసెంబర్ 29న ఉదయం 11 గంటలకు చర్చలకు వస్తామని రైతు సంఘాలు వెల్లడించాయి. ఈ మేరకు నాలుగు అంశాల ఎజెండాతో కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్‌కు రైతు సంఘాలు లేఖ పంపాయి. మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి అనుసరించాల్సిన పద్ధతులపై చర్చించలనేది చర్చల్లో మొదటి అంశం కాగా.. అన్ని రకాల పంటలకు జాతీయ రైతు కమిషన్ సూచించిన లాభదాయకమైన MSPకి చట్ట బద్దత కల్పించడం రెండోది.

ఢిల్లీ పరిసర ప్రాంతాలలో వాయు నాణ్యత నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్ ఆర్డినెన్స్‌కు సవరణలు చేయాలని.. ఆర్డినెన్స్ శిక్షా నిబంధనల నుండి రైతులను మినహాయించాలని మూడో అజెండాగా చేర్చారు. ఇక..రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ‘విద్యుత్ సవరణ బిల్లు 2020’ ముసాయిదాలో అవసరమైన మార్పులు చేయడంపై చర్చించాలనేది నాలుగో అజెండా.!

కేంద్రంతో మనసుపెట్టి చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని రైతు సంఘాలు లేఖలో పేర్కొన్నాయి. గత సమావేశాల వాస్తవాలను దాచిపెట్టి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపించాయి. గత చర్చల సందర్భంగా కూడా వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతు డిమాండ్లను ప్రభుత్వం వక్రీకరించి వ్యవసాయ చట్టాలలో సవరణ చేయాలని మేము కోరుతున్నట్లుగా చెప్తుందని మండిపడుతున్నారు.

నిజంగా రైతు సమస్యలు పరిష్కారించాలంటే రైతులు లెవనెత్తుతున్న డిమాండ్ల గురించి అపార్ధం చేసుకోవద్దని రైతు సంఘాలు సూచించాయి. రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న ప్రచారాన్ని ఆపాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి.

1.మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి అనుసరించాల్సిన పద్ధతులపై చర్చించాలి.
2.అన్ని రకాల పంటలకు జాతీయ రైతు కమిషన్ సూచించిన లాభదాయకమైన MSPకి చట్ట బద్దత కల్పించాలి
3. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వాయు నాణ్యతకోసం ఏర్పాటు చేసిన కమిషన్ ఆర్డినెన్స్ కు సవరణలు చేయాలి..ఆర్డినెన్స్ శిక్షా నిబంధనల నుండి రైతులను మినహాయించాలి
4. రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ‘విద్యుత్ సవరణ బిల్లు 2020’ ముసాయిదాలో అవసరమైన మార్పులు చేయడం పై చర్చ