గుజరాత్ లో ‘సీప్లేన్’ సర్వీసులు ప్రారంభించనున్న మోడీ

The first-ever ‘seaplane services in Gujarat’ దేశంలోనే మొదటిసారిగా గుజరాత్ లో సీప్లేన్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్ నుండి నర్మదా జిల్లాలోని కెవాడియా కాలనీలో గల స్టాచ్యూ ఆఫ్ యూనిటీ(సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం)వరకు సీప్లేన్ సర్వీసులు నడిపేందుకు స్పైస్‌జెట్ సిద్దమైంది.
అక్టోబర్-31న సర్థార్ వల్లభాయ్ పటేల్ 146వ జయంతి సందర్భంగా సీప్లేన్ సర్వీసును మోడీ ప్రారంభించనున్నారు. ప్రయాణ, పర్యాటక రంగాభివృద్ధిని పెంపొందించడమే లక్ష్యంగా రిజినల్ కనెక్టివిటీ స్కీమ్ (ఆర్‌సిఎస్) కింద ఈ సీప్లేన్ సేవలను ప్రారంభిస్తున్నారు. దీంతో ఇక, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి గుజరాత్ చేరుకునే పర్యాటకులు సీప్లేన్ లో ప్రయాణించే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే, నాగపూర్, గౌహతి, ముంబైలలో ఈ సీప్లేన్ విజయవంతమైన ట్రయల్స్ పూర్తిచేసినట్లు స్పైస్ జెట్ అధికారులు తెలిపారు. అంతేకాకుండా యాక్సిడెంట్ ఫ్రీ చరిత్రను కలిగి ఉందన్నారు. అహ్మదాబాద్ నుంచి కెవాడియాకు ప్రయాణ సమయం ప్రస్తుతం నాలుగు గంటలుగా ఉంది. సీ ప్లేన్ సర్వీసు ద్వారా కేవలం గంట వ్యవధిలోనే చేరుకోవచ్చు. వన్-వే ఛార్జీని రూ. 1,500గా నిర్ణయించారు.
అహ్మదాబాద్-కెవాడియా మధ్య ప్రతి వైపు రోజుకు నాలుగు విమాన సర్వీసులు ఉంటాయని అధికారులు తెలిపారు. అంటే నాలుగు విమానాలు చేరుకుంటుంటే మరో నాలుగు విమానాలు బయల్దేరనున్నట్లు తెలిపారు. సీప్లేన్‌లో మొత్తం 12 మంది ప్రయాణించవచ్చు.