Retrospective Tax : రెట్రోస్పెక్టివ్‌ పన్ను విధానం రద్దు ?

రెట్రోస్పెక్టివ్‌ పన్ను విధానం రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఇందులో భాగంగా ఇన్‌కమ్ టాక్స్‌ చట్టాన్ని సవరించనుంది. దీనికి సంబంధించి లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బిల్లును ప్రవేశ పెట్టారు.

Retrospective Tax : రెట్రోస్పెక్టివ్‌ పన్ను విధానం రద్దు ?

Retrospective Tax Policy

Updated On : August 6, 2021 / 11:15 AM IST

retrospective tax policy : రెట్రోస్పెక్టివ్‌ పన్ను విధానం రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఇందులో భాగంగా ఇన్‌కమ్ టాక్స్‌ చట్టాన్ని సవరించనుంది. దీనికి సంబంధించి లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ పన్ను రద్దు చేయడంతో 17 సంస్థలకు లాభం చేకూరనుంది. .

2012 మే, 28కి పూర్వం జరిగిన డీల్స్‌కి సంబంధించి దీని కింద జారీ చేసిన ట్యాక్స్‌ డిమాండ్లను ఉపసంహరించేందుకు.. ట్యాక్సేషన్‌ చట్టాల బిల్లు, 2021ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు. ఆయా సంస్థలు కట్టిన మొత్తాన్ని.. వడ్డీ లేకుండా ప్రభుత్వం తిరిగి చెల్లించే విధంగా ఈ బిల్లులో ప్రతిపాదనలు ఉన్నాయి.

యూపీయే ప్రభుత్వంలో 2012లో ఈ రెట్రోస్పెక్టివ్ పన్ను తీసుకొచ్చారు. భారత్‌లో ఆస్తుల అమ్మకం, షేర్ల బదలాయింపు వంటి లావాదేవీలు గతంలో విదేశాల్లో జరిగినా వాటికి సంబంధించి ఇక్కడ పన్ను కట్టాలని నిర్ణయించారు. గతంలో ఎప్పుడో జరిగిన లావాదేవీలకు కూడా పన్నులు వసూలు చేసే విధానాన్ని రెట్రోస్పెక్టివ్‌ ట్యాక్సేషన్‌గా వ్యవహరిస్తారు. దీని ప్రకారం కొత్తగా పన్ను విధించవచ్చూ లేదా గతంలో చెల్లించిన దానికి అదనంగా వసూలూ చేయవచ్చు.

ఈ టాక్స్ రద్దుతో కెయిర్న్‌ ఎనర్జీ, వొడాఫోన్‌ గ్రూప్‌ వంటి బహుళ జాతి దిగ్గజాలకు ఊరట లభించనుంది. వొడాఫోన్‌ 2007లో భారత్‌లో టెలికం కార్యకలాపాలున్న హచిసన్‌ ఎస్సార్‌లో 67 శాతం వాటాలను కొనుగోలు చేసింది. కేమ్యాన్‌ ఐల్యాండ్స్‌ వేదికగా ఈ డీల్‌ జరిగింది. దీనికి సంబంధించి విత్‌హోల్డింగ్‌ ట్యాక్స్‌ మినహాయించుకోనందుకు 11 వేల 2 వందల 18 కోట్లు కట్టాలంటూ 2010లో వొడాఫోన్‌కు ఆదాయ పన్ను శాఖ నోటీసులు ఇచ్చింది. 2011లో 7 వేల 9 వందల కోట్ల పెనాల్టీ విధించింది. దీన్ని సవాలు చేస్తూ కంపెనీ .. సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

రెండు విదేశీ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందానికి ఇవి వర్తించవంటూ అత్యున్నత న్యాయస్థానం 2012లో ట్యాక్స్‌ డిమాండ్లను కొట్టివేసింది. వొడాఫోన్‌పై విధించిన పన్నును సమర్థించుకునే విధంగా రెట్రోస్పెక్టివ్‌ ట్యాక్స్‌కు సంబంధించి అదే ఏడాది కేంద్రం ఐటీ చట్టాన్ని సవరించింది. అటుపైన 2013లో వొడాఫోన్‌కు మళ్లీ 14 వేల 200 కోట్లకు డిమాండ్‌ నోటీసులు జారీ అయ్యాయి. 2016లో మరోసారి 22 వేల వంద కోట్లు కట్టాలంటూ కంపెనీకి నోటీసులు వచ్చాయి. ఈ వివాదంలో ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌లో వొడాఫోన్‌కి అనుకూలంగా తీర్పు వచ్చింది.

2006లో కెయిర్న్‌ యూకే అంతర్గతంగా కార్యకలాపాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా కెయిర్న్‌ ఇండియా హోల్డింగ్‌లో తన షేర్లను బదలాయించింది. 2011లో దీన్ని వేదాంత రిసోర్సెస్‌కి విక్రయించింది. 2006లో నిర్వహించిన లావాదేవీలకు సంబంధించి క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ కట్టాలంటూ నోటీసులు ఇచ్చారు. దీనిపై కెయిర్న్‌ ఎనర్జీ వివిధ న్యాయస్థానాల్లో పోరాడింది.

భారత్ అడిగినట్టు కెయిర్న్ ఎన‌ర్జీ పన్నులు చెల్లించాల్సిన అవసరంలేదని ఫ్రెంచ్‌కోర్టు తెలిపింది. ఈ నేప‌థ్యంలో భారత ప్రభుత్వం నుంచి త‌మ‌కు 1.72 బిలియన్‌ డాలర్ల ప‌రిహారాన్ని ఇప్పించాలని కోరుతూ కెయిర్న్‌ ఎనర్జీ అమెరికా, యూకే, నెద‌ర్లాండ్స్ న్యాయస్థానాల్లో దావాలు వేసింది. దీంట్లో పారిస్‌లోగ‌ల భార‌తదేశ‌ ఆస్తుల‌ను స్వాధీనం చేసుకోవచ్చంటూ తీర్పు చెప్పింది. అయితే కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంలో ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పడనుంది.