Odisha : స్వర్ణ పతకం సాధిస్తే..రూ. 6 కోట్లు
జపాన్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్ 2021లో పతకాలు సాధించిన క్రీడాకారులకు భారీ నగదు ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. స్వర్ణ పతకం సాధించిన వారికి రూ. 6 కోట్లు ఇస్తామని వెల్లడించారు.

Tokyo Olympics 2021 Odisha Cm Announces Prize
Tokyo Olympics 2021 : ఒలింపిక్ క్రీడలు త్వరలో పాల్గొననున్నాయి. టోక్యో వేదికగా 2021 పాల్గొనేందుకు భారతదేశంలోని పలు రాష్ట్రాల అథ్లెట్లు పాల్గొననున్నారు. ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించారు. వీరిని ప్రోత్సాహించేందుకు పలు రాష్ట్రాలు బహుమతులు ప్రకటిస్తున్నాయి. జపాన్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్ 2021లో పతకాలు సాధించిన క్రీడాకారులకు భారీ నగదు ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. స్వర్ణ పతకం సాధించిన వారికి రూ. 6 కోట్లు ఇస్తామని వెల్లడించారు.
అలాగే..రజత పతకం సాధించిన క్రీడాకారులకు రూ. 4 కోట్లు, కాంస్య పతకం సాధించిన వారికి రూ. 2.5 కోట్లు చొప్పున బహుమతిగా ఇస్తామన్నారు. ఒలింపిక్స్‌కు ఎంపికైన క్రీడాకారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఒలింపిక్స్ లో పాల్గొనే క్రీడాకారులందరికీ రూ. 15 లక్షల చొప్పున నగదు అందచేయనున్నట్లు ఆయన వెల్లడించారు. క్రీడలకు సన్నద్ధమయ్యేందుకు నగదును ఇవ్వనున్నామని తెలిపారు.
రాష్ట్రం నుంచి ఒలింపిక్స్‌కు ద్యుతి చంద్, ప్రమోద్ భగత్, దీప్ గ్రేస్ ఎక్కా, నమిత టొప్పో, వీరేంద్ర లక్రా, అమిత్ రోహిదాస్‌లు వెళ్లనున్నారు. వీరికి సీఎం నవీన్ పట్నాయక్ అభినందనలు తెలిపారు. మరోవైపు టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు ఈనెల 17వ తేదీన భారత తొలి బృందం బయలుదేరనుంది. వాస్తవానికి ఈ నెల 14న వెళ్లాల్సి ఉంది. కానీ ఒలింపిక్స్ నిర్వాహకుల నుంచి ఎలాంటి అనుమతులు లభించలేదు. అక్కడకు చేరుకున్న అనంతరం పలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఒలింపిక్స్ గ్రామానికి చేరుకున్నాక మూడు రోజులు క్రీడాకారులందరూ క్వారంటైన్‌లో ఉండాలి.