Jharkhand Trains Derail: జార్ఖండ్‌లో రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ.. చెల్లాచెదురుగా పడ్డ 20 వ్యాగన్లు..
రైలు పట్టాలు తప్పడం వల్ల ఆద్రా డివిజన్‌లోని చండిల్-గుండా బీహార్ విభాగంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

Jharkhand Trains Derail: జార్ఖండ్ లో రైలు ప్రమాదం జరిగింది. ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. చండిల్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో దాదాపు 20 వ్యాగన్లు చెల్లా చెదురుగా పడిపోయాయి. దీంతో చండిల్ టాటానగర్ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు పలు ఎక్స్ ప్రెస్ రైళ్లను దారి మళ్లించారు అధికారులు.
సమాచారం అందుకున్న అధికారులు ట్రాక్ పై పడ్డ వ్యాగన్లను తొలగించే పనిలో పడ్డారు. త్వరితగతిన రైళ్ల రాకపోకలను తిరిగి ప్రారంభించేందుకు అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. అటు ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరక్కపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
జార్ఖండ్‌లోని సెరైకేలా-ఖర్శ్వన్ జిల్లాలో ఆద్రా డివిజన్ పరిధిలో 2 గూడ్స్ రైళ్లు పట్టాలు తప్పడంతో అనేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారి తెలిపారు. జార్ఖండ్‌లోని చండిల్ నిమ్దిహ్ స్టేషన్ల మధ్య రెండు గూడ్స్ రైళ్లు వ్యతిరేక దిశలో ఒకదానికొకటి ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది.
ప్రాథమిక నివేదికల ప్రకారం, రెండు గూడ్స్ రైళ్లలో ఒకదానిలోని కొన్ని బోగీలు పట్టాలు తప్పాయని, డబుల్-లైన్ విభాగంలో వ్యతిరేక దిశలో కదులుతున్న రైలు మధ్య భాగాన్ని ఢీకొట్టాయని, దీని వల్ల దానిలోని కొన్ని బోగీలు పట్టాలు తప్పాయని అధికారి వివరించారు. రైలు పట్టాలు తప్పడం వల్ల ఆద్రా డివిజన్‌లోని చండిల్-గుండా బీహార్ విభాగంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పట్టాలు తప్పడం వల్ల చండిల్ నుండి పైకి కిందికి రైలు సేవలు ప్రభావితమయ్యాయని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ (ఆద్రా డివిజన్) వికాశ్ కుమార్ తెలిపారు.
Also Read: ఎవరీ అస్మి ఖరే? ఈ విద్యార్థిని ఏం చేసింది? ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆహ్వానం