ప్రియుడిపై యాసిడ్ పోసిన మహిళ

Tripura Woman Throws Acid On Estranged Boyfriend : తనను దూరం పెట్టినందుకు..మాట్లాడకుండా..నిర్లక్ష్యం చేస్తున్నందుకు ప్రియుడిపై మహిళ యాసిడ్ పోసింది. దీంతో అతను తీవ్రగాయాలై చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన త్రిపుర రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…అగర్తలాకు 50 కిలోమీటర్ల దూరంలో బీనా (27), సోమన్ (30)లు పక్కపక్క ఇళ్లలో ఉండేవారు.
వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పదేళ్ల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయారు. 2010 నుంచి మహారాష్ట్రలోని పుణెలో నివాసం ఉండేవారు. సోమన్ చదువుకొనసాగించడానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురయ్యేవి. దీంతో బీనా..చిన్న చిన్న పనులు చేస్తూ..అవసరమైన డబ్బులను సమకూర్చేది.
అనంతరం సోమన్ కు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చింది. బీనాతో 9 సంవత్సరాలు కలిసి ఉన్న సోమన్…2019లో సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చాడు.
ఇక అప్పటి నుంచి బీనాతో మాట్లాడడం మానేశాడు. సోమన్ గురించి కనుక్కొందామని బీనా చాలా ప్రయత్నాలే చేసింది. కానీ..అతని ఆచూకి తెలియలేదు. ఎట్టకేలకు 2020, అక్టోబర్ 19వ తేదీన త్రిపురలోని ఖోవై ప్రాంతంలో సోమన్ ఉన్నట్లు బీమా గుర్తించింది.
అతనితో మాట్లాడటానికి ప్రయత్నించినా..సోమన్ నిరాకరించాడు. తనతో మాట్లాడకుండా..దూరం పెడుతున్నాడన్న కోపంతో అతనిపై యాసిడ్ తో దాడికి పాల్పడింది. ఈ ఘటనలో అతనికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిళపై కేసు నమోదు చేశారు పోలీసులు. అనంతరం బీనాను పోలీసులు అరెస్టు చేశారు. తీవ్రమైన కాలిన గాయాలు కావడంతో…బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.