మహిళలను దేవుడే కాపాడాలి : చౌకీదార్ ఎంజే అక్బర్ పై నెటిజన్లు ఫైర్

  • Published By: venkaiahnaidu ,Published On : March 19, 2019 / 02:47 PM IST
మహిళలను దేవుడే కాపాడాలి : చౌకీదార్ ఎంజే అక్బర్ పై నెటిజన్లు ఫైర్

Updated On : March 19, 2019 / 2:47 PM IST

మీటూ ఉద్యమంలో ఆరోపణలు ఎదుర్కొని కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన   ఎం.జే అక్బర్‌ పై నెటిజన్లు మరోసారి సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ చౌకీదార్ చోర్ హై ఆరోపణలను తిప్పికొట్టడంలో భాగంగా ప్రధాని మోడీ ఇటీవల మైన్‌ భీ చౌకీదార్‌ అనే ఉద్యమాన్ని ట్విటర్‌ ద్వారా ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రధాని బాటలో అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ,జేపీ నడ్డా,స్మృతీ ఇరానీ వంటి పలువురు బీజేపీ సీనియర్లు సైతం వారి పేర్లముందు చౌకీదార్‌ అని చేర్చుకున్నారు. దీంతో కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్‌ కూడా చౌకీదార్‌ అనే పదాన్ని జోడించుకున్నారు.

మైన్‌ భీ చౌకీదార్‌ ఉద్యమంలో నేను కూడా భాగమైనందుకు గర్వంగా ఉంది. భారత పౌరుడిగా అవినీతిని, ఉగ్రవాదాన్ని, పేదరికాన్ని నిర్మూలించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. బలమైన నూతన భారతాన్ని సృష్టిస్తాను అని ఆయన ట్వీట్‌ చేశారు. దీంతో అక్బర్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పించారు.

ఎంజే అక్బర్‌ తానో కాపలాదారుడినని అనుకుంటున్నారు. ఆయనకిది సరిపోదు. ఇలాంటి పనులు చేయడం వల్ల ఆయన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది., మహిళలకు గౌరవం ఇవ్వండి చాలు,మీరు కాపలాదారుగా మారితే దేశంలో మహిళలు భయపడుతూ ఉండాల్సి వస్తుంది. ఇక వారిని దేవుడే కాపాడాలి అంటూ అని సోషల్ మీడియాలో ఆయనపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.ఎక్కువగా మహిళలు సోషల్ మీడియాలో అక్బర్ పై…దేశంలో మహిళలకు రక్షణ లేకుండా చేస్తారా అంటూ తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు.దీంతో అక్బర్‌ చౌకీదార్‌ అనే పదాన్ని తీసేశారు. కొంత సేపటి తర్వాత మళ్లీ ఈ పదాన్ని చేర్చుకున్నారు.