Udhayanidhi: ఎట్టకేలకు ప్రమోషన్.. తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే?
డిప్యూటీ సీఎం పదవిపై ఉదయనిధి స్టాలిన్ స్పందిస్తూ.. ఉపముఖ్యమంత్రి పదవి అనేది పదవి కాదు బాధ్యత అన్నారు. రాష్ట్రంకోసం పనిచేస్తానని చెప్పారు.

Udhayanidhi Stalin
Udhayanidhi Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, డీఎంకే యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ కు ఎట్టకేలకు ప్రమోషన్ వచ్చింది. ఆయన తమిళనాడు డిప్యూటీ సీఎంగా నియామకం అయ్యారు. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రమాణం చేయించనున్నారు. ఉదయనిధి స్టాలిన్ తో పాటు నలుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మనీలాండరింగ్ కేసులో బెయిల్ పొందిన సెంథిల్ బాలాజీని మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
డిప్యూటీ సీఎం పదవిపై ఉదయనిధి స్టాలిన్ స్పందిస్తూ.. ఉపముఖ్యమంత్రి పదవి అనేది పదవి కాదు బాధ్యత అన్నారు. రాష్ట్రంకోసం పనిచేస్తానని చెప్పారు. ఇదిలాఉంటే.. ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుతం క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. ప్లానింగ్ డిపార్ట్ మెంట్ కూడా అతని వద్దే ఉంది. ఉదయనిధి స్టాలిన్ కు ప్రస్తుతం 46ఏళ్లు. 2021 మేలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. డిసెంబర్ 2022లో స్టాలిన్ మంత్రివర్గంలోకి వచ్చారు. గత ఏడాది నుంచి ఉదయనిధి స్టాలిన్ ను డిప్యూటీ సీఎంగా నియమించాలని పార్టీ క్యాడర్ నుంచి డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అయితే, ముఖ్యమంత్రి స్టాలిన్ మాత్రం ఆ మేరకు మొగ్గుచూపలేదు. ఉదయనిధి సనాతన ధర్మ ప్రకటనపై బీజేపీ తీవ్రంగా టార్గెట్ చేయడంకూడా ఒక ముఖ్యమైన కారణం.
లోక్ సభ ఎన్నికల ముందు ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎంగా ఎంపిక అవుతారని అందరూ భావించినప్పటికీ వాయిదా పడింది. ఆ తరువాత రాష్ట్రంలోని కళ్లకురిచిలో కల్తీ మద్యం కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడంతో ఉయనిధి డిప్యూటీ సీఎం వ్యవహారం వెనక్కు వెళ్లిపోయింది. ఆగస్టులో ఉయనిధికి పదోన్నతి లభిస్తుందని పార్టీ నేతలు భావించారు.. కానీ, డీఎంకే పార్టీ నేత సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేయడంతో స్టాలిన్ వెనక్కు తగ్గాడు. అయితే, గతంలో ఉదయనిధికి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టేందుకు నిరాకరించిన స్టాలిన్.. సెంథిల్ బాలాజీకి బెయిల్ వచ్చిన రెండు రోజులకే తన వైఖరిని మార్చుకున్నారు. సెంథిల్ బాలాజీని మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకురాగా.. ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా ప్రకటించారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న ఉదయనిధికి బాధ్యతలు మరింత పెరగనున్నాయి. ఆ ప్రక్రియలో ఉయనిధి ఏమేరకు విజయం సాధిస్తాడనే అంశం చర్చనీయాంశంగా మారింది.