Union Budget: అశల పల్లకీలో.. నేడే కేంద్ర బడ్జెట్.. పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరట లభించేనా.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి..
ఉదయం 11గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ఈ బడ్జెట్ లో పేద, మధ్య తరగతి ప్రజలపై వరాల జల్లు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Nirmala sitharaman
Union Budget: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ను ఇవాళ పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుంది. ఉదయం 11గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ పై దేశవ్యాప్తంగా పేదలు, మధ్యతరగతి వర్గాల ప్రజలు, వేతన జీవుల నుంచి పారిశ్రామిక వర్గాల వరకూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో తమకు ఏమైనా ప్రయోజనం కలిగించే ప్రకటనలు ఉంటాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ బడ్జెట్ లో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు పలు అంశాల్లో ఊరట లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైతులు, పేదలు, మహిళలు, యువతపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అయితే, ఆర్థిక వృద్ధిరేటు నాలుగేళ్ల కనిష్ట స్థాయికి మందగించిన నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, ఇతర దేశాలపై సుంకాల బెదిరింపుల నేపథ్యంలో నిర్మలా సీతారామన్ ఇవాళ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న బడ్జెట్ లో మధ్యతరగతి, సామాన్యుల కోసం గుడ్ న్యూస్ రాబోతున్నట్టు కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇద్దరూ దీనికి సంబంధించిన హింట్ ఇచ్చారు. శుక్రవారం పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ ప్రారంభం కావడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ పేదలు, మధ్యతరగతి ప్రజల మీద ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంలో కీలక కామెంట్స్ చేశారు. పేద, మధ్యతరగతి ప్రజల కలలను సాకారం చేయడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దీన్నిబట్టి ఇవాళ ప్రవేశపెట్టబోయే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరటకలిగించే కీలక అంశాలు ఉంటాయని తెలుస్తోంది.
ఈసారి బడ్జెట్ లో పలు రంగాల పన్నులు తగ్గించాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. ఆదాయపు పన్ను విధానాన్ని మరింత సరళీకరించడంలో భాగంగా టాక్స్ శ్లాబులను 6నుంచి మూడుకు కుదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామీణ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు హౌసింగ్ ఫర్ ఆల్ పేరుతో సాయం చేయనుంది. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 2029 నాటికి కోటి మంది పేదలు, మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చేందుకు భారీగా సాయం అందించనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత బడ్జెట్ లో మహిళలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా వారికి నైపుణ్య శిక్షణ కల్పించడంతో పాటు జన్ ధన్ యోజన, ముద్ర యోజన వంటి పథకాలకు కేటాయింపులు మరింత పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి ఇవాళ నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరట లభించే కల్పించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు సమాచారం.
మరోవైపు కేంద్రబడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు భారీగానే ఆశలు పెట్టుకున్నాయి. ఏపీ పోలవరం, అమరావతి అభివృద్ధికి మరిన్ని నిధులు కోరుతుండగా.. తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ పై భారీగానే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి లక్షన్నర కోట్లకుపైగా రేవంత్ సర్కార్ ఆశిస్తోంది. మూసీ ప్రక్షాళనకు, మెట్రో ఫేజ్-2కి, రీజనల్ రింగ్ రోడ్డుకు ఇలా పలు కార్యక్రమాలకు కేంద్ర బడ్జెట్ లో నిధులు మంజూరు అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయింపుపై ఆశగా ఎదురు చూస్తున్న క్రమంలో నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో ఏఏ రంగాలకు, ఏ మేరకు నిధులు కేటాయిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.