మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర కేబినెట్ ఆమోదం

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర మంత్రివర్గం సిఫారసు చేసింది. గత నెలలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల తరువాత ఏ రాజకీయ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడంతో రాష్ట్రపతి పాలనకు మంత్రివర్గం సిఫారసు చేసింది. ప్రభుత్వ ఏర్పాటుపై ఓ వైపు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ లు మంతనాలు జరుపుతుండగానే కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం అత్యవసరంగా సమావేశం అయ్యిన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభనపైనే ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అక్టోబరులోనే వెలువడి నప్పటికీ.. తగిన మెజారిటీ లేక ఇప్పటి వరకు ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక పోయింది. ఈ పరిస్థితుల్లోనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం సిఫారసు చేసినట్టు తెలుస్తోంది.