Union Minister Annapurna Devi: కామెడీ పేరుతో లేడీస్ మీద వెకిలి జోకులు వేస్తే.. కేంద్ర మంత్రి సంచలన కామెంట్స్..
కామెడీ పేరుతో మహిళల పట్ల అసభ్యకరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవి (Union Minister Annapurna Devi)స్పష్టం చేశారు.
Union Minister Annapurna Devi calls for legal action over inappropriate jokes on women
- మహిళలపై అసభ్య కామెడీ షోలు తప్పు.
- నిందితులపై చట్టపరమైన చర్యలు తప్పవు.
- వివాహ వయస్సుపై విస్తృత చర్చ కావాలి.
Union Minister Annapurna Devi: కామెడీ పేరుతో మహిళల పట్ల అసభ్యకరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవి(Union Minister Annapurna Devi) స్పష్టం చేశారు. అలాంటి వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కొందరు స్టాండప్ కామేడియన్లు మహిళలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, వారిపై నమోదైన కేసుల నేపథ్యంలో ఇండోర్లో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. హాస్య ప్రదర్శనలే కాకుండా మరే ఇతర కార్యక్రమాల్లోనైనా మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. సమాజంపై ప్రతికూల ప్రభావం చూపే ఇలాంటి ధోరణులను సహించేది లేదని ఆమె తేల్చి చెప్పారు. గతాన్ని పరిశీలిస్తే ఇలాంటి విషయాలపై అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకున్నారని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు.
మహిళల కనీస వివాహ వయస్సును పెంచే అంశంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చపై మంత్రి స్పందిస్తూ, దీనిపై సమాజంలో మరింత విస్తృతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న భారతీయ చట్టాల ప్రకారం పురుషులకు 21 ఏళ్లు, మహిళలకు 18 ఏళ్ల లోపు వివాహం జరిపిస్తే దానిని బాల్య వివాహంగా పరిగణిస్తారని వివరించారు. బాల్య వివాహాల నిరోధక చట్టం-2006 ప్రకారం ఈ నేరానికి పాల్పడిన వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా లేదా రెండు కలిపి విధించే అవకాశం ఉందని ఆమె స్పష్టం చేశారు. సామాజిక మార్పు అనేది కేవలం చట్టాల ద్వారానే కాకుండా, ప్రజల ఆలోచనా విధానంలో వచ్చే మార్పు ద్వారానే సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.
మరోవైపు మధ్యప్రదేశ్లో ఏకరూప పౌర స్మృతి అమలు, సహజీవనం, బహుభార్యత్వం వంటి సున్నితమైన అంశాలపై జరుగుతున్న చర్చను ఆమె ప్రస్తావించారు. వీటిపై ఇప్పటికే కొన్ని చట్టాలు అందుబాటులో ఉన్నాయని, అయితే క్షేత్రస్థాయిలో ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా మాత్రమే సానుకూల మార్పులు వస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి సున్నితమైన విషయాలలో ముందడుగు వేసే ముందు ప్రభుత్వం అన్ని వర్గాల అభిప్రాయాలను, భాగస్వామ్యాలను పరిగణనలోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో యూసీసీ అమలు సాధ్యాసాధ్యాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పర్యటిస్తోందని ఆమె వెల్లడించారు.
